విద్యాలయాల వద్ద నిఘా పెంచాలి
● ఎస్పీ సునీల్ షెరాన్
కొలిమిగుండ్ల: పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్ల వద్ద నిఘా పెంచాలని పోలీసులకు ఎస్పీ సునీల్ షెరాన్ సూచించారు. అమ్మాయిలు ఆకతాయిల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హాస్టళ్ల వద్ద లైటింగ్ సౌకర్యంతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాలన్నారు. కొలిమిగుండ్ల, అవుకు పోలీస్ స్టేషన్‌లను శుక్రవారం ఎస్పీ తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి కేసుల పురోగతిపై సీఐ రమేష్‌బాబు, అవుకు ఎస్‌ఐ అశోక్‌తో చర్చించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మందుబాలులు బహిరంగ ప్రదేశాలతో పాటు పాఠశాలల వద్ద మద్యం సేవించకుండా పోలీస్ కానిస్టేబుళ్లతో తరచూ గస్తీ చేయించాలన్నారు. సైబర్ మోసాలపైప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. కొలిమిగుండ్లలో పోలీస్ సిబ్బంది ఉండే క్వార్టర్స్ శిథిలమయ్యాయని వాటి స్థానంలో కొత్తవి నిర్మించేందుకు హౌసింగ్ కార్పొరేషన్‌కు నివేదికలు పంపుతున్నట్లు పేర్కొన్నారు.


