ఉగాది నాటికి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి
● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల: జిల్లాలో నిర్దేశించిన గృహ నిర్మాణాలను ఉగాది నాటికి పూర్తిచేయాలని హౌసింగ్ అధికారులను జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని ఎన్‌ఐసీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి మున్సిపల్ కమిషనర్లు, డీఎల్‌డీవోలు, ఎంపీడీవోలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలోని గృహాల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఉగాది నాటికి 10,178 గృహాలను పూర్తిచేయాలన్నారు. ప్రస్తుతం 374 గృహాలు పూర్తయ్యాయని, బేస్‌మెంట్, లెంటల్, రూఫ్ లెవెల్‌లలో ఉన్న వాటిని ఉగాది నాటికి పూర్తి చేయాలన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 కింద మంజూరైన 2,348 గృహాల్లో 584 గృహాలకు గ్రౌండింగ్ పూర్తయ్యిందని, మిగిలిన 1,630 గృహాలకు ఫిబ్రవరి నెలాఖరులోగా శాతం వంద గ్రౌండింగ్ పూర్తి చేయాలన్నారు. చెంచు కాలనీల్లో పీఎం జన్మన్ పథకం కింద మంజూరైన 556 గృహాలలో 302 గృహాలు గ్రౌండింగ్ అయ్యాయని, మిగిలిన 254 గృహాలకు కూడా తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించి మంజూరైన 26,609 యూనిట్లలో 12,616 పూర్తి కాగా, బేస్‌మెంట్ స్థాయిలో ఉన్న 3,409 యూనిట్లను వేగవంతం చేయాలని, ఇంకా ప్రారంభం కాని 8,679 యూనిట్లకు గ్రౌండింగ్ చేపట్టి మార్చి 31లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ కింద మంజూరైన 12,715 గృహాలలో 8,112 పూర్తయ్యాయని, మిగిలిన 4,603 గృహాలకు సంబంధించిన ఖాతా వివరాలను ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలన్నారు.


