లైన్‌మ్యాన్‌కు ఉత్తమ పురస్కారం
బేతంచెర్ల: పట్టణానికి చెందిన విద్యుత్ లైన్‌మ్యాన్ నాగరాజ శేఖర్ ఉత్తమ అవార్డుకు ఎంపికయ్యారు. మార్చి7న దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగే లైన్‌మెన్ దివాస్ వేడుకలో ఆయన పురస్కారాన్ని అందుకోనున్నారు. ప్రజలకు అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు వచ్చింది. లైన్‌మ్యాన్ నాగరాజ శేఖర్‌ను విద్యుత్ ఏడీ మధుసూదన్ రెడ్డి, ఏఈలు శ్రీనివాసులు, శివన్న, సిబ్బంది అభినందించారు.
ఉర్దూ స్కూళ్ల పనివేళలు మార్పు
నంద్యాల(న్యూటౌన్): రంజాన్ నెల సందర్భంగా ఉపవాసం పాటించే విద్యార్థులు, ఉపాధ్యాయుల సౌకర్యార్థం జిల్లాలోని ఉర్దూ మాధ్యమ పాఠశాలలో పనివేళలు మార్పు చేసినట్లు డీఈఓ జనార్దన్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని ఉర్దూ మాధ్యమ ప్రాథమిక, ప్రాథమికోన్నత, హైస్కూళ్లను ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 1.30గంటల వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పనివేళలు రంజాన్ నెలలో అమలవుతాయని పేర్కొన్నారు. జిల్లాలో ఇస్లాం మతాన్ని ఆచరించే ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు ప్రతి రోజు పని దినంలో సాధారణ ముగింపు సమయానికి ఒక గంట ముందుగానే వెళ్లేందుకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు.
అహోబిలేశుడి సేవలో
టీవీఎస్ చైర్మన్
ఆళ్లగడ్డ: శ్రీ అహోబిల లక్ష్మీ నరసింహస్వామిని టీవీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ వేణు శ్రీనివాసన్ బుధవారం దర్శించుకున్నారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో అహోబిలం చేరుకున్న ఆయనకు ఆలయ మర్యాదల్లో భాగంగా ప్రధాన అర్చకులు వేణుగోపాలన్ ఆధ్వర్యంలో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం దిగువ అహోబిలం క్షేత్రంలో వెలసిన శ్రీ ప్రహ్లాదవరదస్వామి, అమృతవల్లీ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు స్వామివార్ల శేషవస్త్రం, ప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనం చేశారు. అనంతరం మఠం చేరుకుని పీఠాధిపతి ఆశీర్వాదాలు తీసుకున్నారు.
ఫ్యాక్టరీల్లో భద్రతా ప్రమాణాలు పాటించాలి
నంద్యాల: జిల్లాలోని అన్ని ఫ్యాక్టరీలు, కర్మాగారాల్లో భద్రతా ప్రమాణాలు పాటించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా విపత్తుల నిర్వహణ సమితి సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. కార్మికులకు ఫస్ట్ ఎయిడ్ శిక్షణ అందించడంతో పాటు ప్రమాద సూచికల బోర్డులు స్పష్టంగా ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి యూనిట్‌లో భద్రతా ప్రమాణాలను పరిశీలించే బాధ్యత గల సిబ్బందిని నియమించి, కార్మికులకు తగిన శిక్షణ ఇవ్వాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లే మార్గాలైన ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఎక్కడ ఉన్నాయో ప్రతి కార్మికునికి స్పష్టంగా తెలిసేలా ఉండాలన్నారు. దుగ్గిరాలలోని టర్మరిక్ కోల్డ్ స్టోరేజ్ యూనిట్‌లో జరిగిన అగ్నిప్రమాదాన్ని అదుపులోకి తేవడానికి సుమారు 25 రోజులు పట్టిందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. డోన్ మండలం ఉడుములపాడు గ్రామ సమీపంలోని అగ్రి సోల్ ప్రైవేట్ లిమిటెడ్, నంద్యాల మండలం ఊడుమాల్పురం ప్రాంతంలోని ఎస్పీ ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్ పరిశ్రమల నుంచి వచ్చే దుర్వాసనతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారని పేర్కొన్నారు. సమావేశంలో డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ నారాయణరెడ్డి, నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
లైన్‌మ్యాన్‌కు ఉత్తమ పురస్కారం
లైన్‌మ్యాన్‌కు ఉత్తమ పురస్కారం


