శ్రీశైలం.. పుష్పశోభితం
అశ్వవాహనంపై ఊరేగిన స్వామిఅమ్మవారు
శ్రీగిరిలో ముగిసిన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
శ్రీశైలంటెంపుల్: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల చివరిరోజు బుధవారం శ్రీశైలంలో స్వామిఅమ్మవార్లకు పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంతసేవ నిర్వహించారు. తొలుత అక్కమహాదేవి అలంకార మండపంలో అశ్వవాహనంపై స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను అధిష్టింపజేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ఉత్సవం నిర్వహించారు. ఉత్సవంలో డప్పు వాయిద్యాలు, జానపద కళాకారుల నృత్యప్రదర్శనలు అకట్టుకున్నాయి. అనంతరం స్వామిఅమ్మవార్లకు పుష్పోత్సవం జరిపారు. ఇందులో పలు రకాల సుగంధ పుష్పాలను వినియోగించారు. ఉత్సవమూర్తులకు అద్దాల మండపంలో(శయమందిరం)లో శయనోత్సవం నిర్వహించి ఏకాంతసేవ జరిపారు. ఆయా పూజా కార్యక్రమాల్లో దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట రమేష్‌నాయుడు, కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు, ఇతర ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ముగిసిన బ్రహ్మోత్సవాలు
ఈ నెల 8వ తేదీ నుంచి ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 11రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రతిరోజు స్వామిఅమ్మవార్లకు వివిధ రకాల వాహనసేవలు నిర్వహించారు. సోమవారం నిర్వహించిన అశ్వవాహనసేవ, పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంతసేవ కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఉత్సవాలకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు లక్షలాదిగా తరలివచ్చి స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు.
శ్రీశైలం.. పుష్పశోభితం


