ప్రణాళిక నీరసించి.. ఏకాగ్రత చెదిరి | - | Sakshi
Sakshi News home page

ప్రణాళిక నీరసించి.. ఏకాగ్రత చెదిరి

Feb 18 2026 7:06 AM | Updated on Feb 19 2026 3:49 PM

అర్ధాకలితో పదో తరగతి విద్యార్థుల అభ్యసనం

రోజూ ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు

అల్పాహారం లేక నిత్యం నకనక

పైసా కూడా విదిలించని ప్రభుత్వం

నీరసించిపోతున్న విద్యార్థులు

పట్టించుకోని విద్యాశాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు

ఉత్తమ ఫలితాలు సాధించేందుకు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ‘పది’ విద్యార్థులకు వంద రోజుల ప్రణాళిక పేరుతో సుమారు రెండు నెలలుగా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం, అధికారులు లక్ష్యాన్ని నిర్దేశించారే కానీ.. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకోవడం లేదు.

ఆళ్లగడ్డ: జిల్లా వ్యాప్తంగా మొత్తం 206 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉండగా అందులో ఈ ఏడాది 11,252 మంది పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. వచ్చేనెల 16 నుంచి ప్రారంభం కానున్న పరీక్షల్లో ఎలాగైనా వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని ఉన్నతాధికారులు ఒత్తిడి తెస్తున్నారు. ఉపాధ్యాయులు కూడా అదే స్థాయిలో ప్రతి రోజూ ఉదయం 8 నుంచి, సాయంత్రం 6 గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో సెలవు రోజుల్లో కూడా తరగతులు నిర్వహిస్తూ మోడల్‌ పరీక్షలు పెడుతున్నారు. సామర్థ్యాలను గుర్తిస్తూ వెనుకబడిన విద్యార్థులపై మరింత ఒత్తిడి తీసుకువస్తూ తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ ప్రణాళిక ప్రకారం ఉదయం 7 గంటలకు ఇంటి నుంచి బయలుదేరితే సాయంత్రం 6 గంటల వరకు స్కూల్‌లో ఉండాలి. దూర ప్రాంత పిల్లలు ఉదయం 6 గంటలకు ఇంటి నుంచి బయలుదేరి మళ్లీ రాత్రి 7, 8 గంటలకు ఇంటికి చేరుకుంటున్నారు. అంటే సుమారు 12 గంటలు పాఠశాల లో సాధారణ తరగతులతో పాటు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు, అసైన్‌మెంట్లు, ప్రిపరేషన్‌ పరీక్షలు రాయడంతో విద్యార్థులు నీరసించి పోతున్నారు. విద్యార్థుల క్షేమం దృష్ట్యా రోజుకు ఓ సారైనా స్నాక్స్‌ ఇచ్చే ప్రయత్నం కూడా చేయకపోవడంతో తీవ్రంగా ఇబ్బంది పడుతు న్నారు. అనేక మంది నీరసించి అస్వస్థతకు గురువుతున్నా చంద్రబాబు ప్రభుత్వం ఏమ్రాతం పట్టించుకోకపోవడం పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.

చదువులతో కుస్తీ.. ఆకలితో సుస్తీ

ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులు పబ్లిక్‌ పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం విద్యార్థుల అర్ధాకలి గురించి పట్టించుకోవడం లేదు. వంద రోజుల ప్రణాళిక సజావుగా సాగుతుందా లేదా అని అధికారులు తనిఖీలు చేస్తున్నారే కానీ విద్యార్థుల ఆకలి కేకలు ఎవరీ పట్టడం లేదు. విద్యార్థులు ఉదయం నుంచి రాత్రి వరకు ఒక్క మధ్యాహ్నం భోజనం మాత్రమే తిని ఎలా చదువుకుంటారని ఆలోచించడం లేదు. వసతి గృహాల సౌకర్యం ఉన్న కేజీబీవీ, గురుకుల, ఏపీ మోడల్‌ హైస్కూల్‌ విద్యార్థులకు మాత్రం ఉదయం ఓసారి, సాయంత్రం మరోసారి స్నాక్స్‌ సదుపాయం కల్పించేందుకు ప్రత్యేకంగా నిధులు సమకూర్చుతోంది. అయితే ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, మున్సిపల్‌ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మాత్రం ఒక్క పైసా విదల్చలేదు. కనీసం దాతల సహాయం తీసుకోండి అని కూడా అధికారికంగా చెప్పకపోవడంతో పాఠశాలల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు ఏమీ చేయలేక పోతున్నారు. ఫలితంగా విద్యార్థులు నీరసించి అనారోగ్యం పాలవుతున్నారు.

సార్‌.. ఆకలి!

విద్యార్థులకు ప్రత్యేక తరగతుల సమయంలో విద్యార్థుల పరిస్థితిని చూసి కొందరు ఉపాధ్యాయులు కొంత మేరైనా స్నాక్స్‌ అందించేందుకు దాతలు, స్వచ్ఛంద సంస్థలను ఆశ్రయిస్తున్నా.. ఎవరూ స్పందించడం లేదు. దీంతో మనకెందుకులే అని కొందరు ఉపాధ్యాయులు చందాల రూపంలో బిస్కెట్లు తదితర వాటిని అందజేస్తున్నారు. కొందరు విద్యార్థులు ‘సార్‌ ఆకలి’.. అవుతోందని అడిగితే మధ్యాహ్నం భోజనం సమయంలో ఇచ్చే చిక్కీలు ఇస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. అటువంటి పిల్లలను చూస్తే బాధేస్తుందని, అయినా ఏమి చేయలేని పరిస్థితి తమదని అనేక మంది ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement