ప్రారంభానికి మోక్షమెన్నడో!
● నిర్మాణం పూర్తయినా ప్రారంభానికి
నోచుకోని సచివాలయం
● పంచాయతీ భవనంలోనే
విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు
కోవెలకుంట్ల: గ్రామస్థాయిలో పరిపాలనను వికేంద్రీకరణ చేస్తూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చింది. ప్రజలకు సేవలందించే ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు ఉండాలన్న ఉద్దేశంతో గ్రామాల్లో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్‌క్లినిక్‌లకు రాజభవనాల తరహాలో అన్ని హంగులతో భవనాలు నిర్మించింది. కోవెలకుంట్ల మండలం రేవనూరులో రూ. 38.40 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనం ప్రారంభానికి నోచుకోక నిరుపయోగంగా మారింది. అనివార్య కారాణాలతో గత ప్రభుత్వం భవనాన్ని ప్రారంభించలేకపోయింది. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి 18 నెలలు కావస్తున్నా గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభించేందుకు చర్యలు తీసుకోలేదు. గతంలో ఉన్న గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సచివాలయ ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ భవనంలో అరకొర వసతులు ఉండటంతో ఉద్యోగులు, కార్యాలయానికి వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అన్ని వసతులతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని వినియోగంలోకి తీసుకు రాకపోవడంతో నిరుపయోగంగా మారింది. కొత్త భవనం చుట్టూ ముళ్లపొదలు పేరుకపోయి భవన ప్రాంతంలో విష సర్పాలు సంచరిస్తున్నాయి. సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రారంభానికి మోక్షమెన్నడో!


