చెంచులకు నెలలో ఒకరోజు ఉచిత స్పర్శ దర్శనం
శ్రీశైలం టెంపుల్: శ్రీశైలం స్థానిక చెంచు గిరిజనులకు నెలలో ఒకరోజు మల్లికార్జున స్వామివారి స్పర్శదర్శనం ఉచితంగా కల్పిస్తామని శ్రీశైల దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ పి.రమేష్‌నాయుడు తెలిపారు. బుధవారం దేవస్థానం అన్నదాన భవన సమీపంలోని కమాండ్ కంట్రోల్ రూంలో ధర్మకర్తల చైర్మన్ పి.రమేష్ నాయుడు అధ్యక్షతన మండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు, ఎక్స్ అఫీషియో సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు హాజరయ్యారు. సమావేశంలో 14 అంశాలు చర్చించగా, 11అంశాలు ఆమోదించారు. 2అంశాలను వాయిదా, ఒక అంశాన్ని తిరస్కరించారు. సమావేశం అనంతరం చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ జనవరి 12 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించే మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాల నిర్వహణకు ప్రణాళికబద్ధంగా అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. కొత్తపల్లి మండలం శివపురంలోని కొలనుభారతి సరస్వతి అమ్మవారి దేవాలయాన్ని శ్రీశైల దేవస్థానం దత్తత దేవాలయంగా నిర్వహింపజేయాలని దేవదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఆ దేవాలయానికి సంబంధించిన భూములు, బంగారం, వెండి, ఎఫ్‌డిఆర్‌లు, నగదును దేవస్థానం ఏర్పాటు చేసిన అధికారుల బృందం, ధర్మకర్తల మండలి సమక్షంలో త్వరలో స్వాధీనం చేసుకుంటామన్నారు. డిసెంబర్ 1వ తేది నుంచి మల్లన్న స్పర్శదర్శనం, అతిశీఘ్ర దర్శనం భక్తులకు ఉచితంగా లడ్డూ ప్రసాదాలను అందజేస్తామన్నారు. భక్తులు సూచనలు, సలహాలు స్వీకరించేందుకు పలుచోట్ల ఫిర్యాదులు, సలహాల పెట్టెలను ఏర్పాటు చేస్తామన్నారు.


