కిడ్నీలను దెబ్బతీసే లూపస్‌.. రోగనిరోధక వ్యవస్థ వల్లే శరీరానికి హానీ!

- - Sakshi

సాధారణంగా మనలోని రోగనిరోధక వ్యవస్థ బయట నుంచి వచ్చే బ్యాక్టీరియా, వైరస్‌లపై దాడి చేసి మన శరీరానికి రక్షణ కల్పిస్తాయి. కానీ ఆ రోగనిరోధక వ్యవస్థ వల్లే శరీరానికి హాని జరిగితే కలిగే ఇబ్బందినే ఆటో ఇమ్యూన్‌ వ్యాధులంటారు. ఇందులో ప్రధానమైనది లూపస్‌. దీనిని సిస్టమిక్‌ లూపస్‌ ఎరిథమాటోసస్‌(ఎల్‌ఎల్‌ఈ) అని కూడా పిలుస్తారు. ఈ నెల 10వ తేదిన వరల్డ్‌ లూపస్‌ డే సందర్భంగా ఈ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కథనం.

కర్నూలు(హాస్పిటల్‌): ఎస్‌ఎల్‌ఈ లేదా లూపస్‌ను తీవ్రమైన ఆటో ఇమ్యూన్‌ వ్యాధిగా వైద్యులు పేర్కొంటారు. ఈ వ్యాధి మనిషి శరీరంలోని ప్రతి అవయవాన్ని ప్రభావితం చేస్తుంది. చాలా వరకు అవగాహన లోపం కారణంగా సరైన సమయంలో గుర్తించకపోతున్నారు. సాధారణంగా సమాజంలో ప్రతి లక్షలో వంద మందికి ఈ వ్యాధి ఉంటుంది.

జిల్లాలోని రుమటాలజిస్టులు, జనరల్‌ ఫిజీషియన్లు, నెఫ్రాలజిస్టుల వద్దకు ప్రతి నెలా 60 నుంచి 100 మంది దాకా ఈ వ్యాధి బాధితులు చికిత్స కోసం వస్తున్నారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలో దాదాపు 5వేల మంది దాకా లూపస్‌తో బాధపడుతున్నట్లు అంచనా. శరీరంలోని కణాలు, కణజాలంపై వ్యక్తి యొక్క సొంత రోగనిరోధక వ్యవస్థ దాడి చేసినప్పుడు లూపస్‌ వ్యాధి అభివృద్ధి చెందుతుంది.

దీనివల్ల గుండె, ఊపిరితిత్తులు, చర్మం, కీళ్లు, మూత్రపిండాలు, రక్తనాళాలు, మెదడు వంటి వివిధ అవయవాలు, శరీర వ్యవస్థకు హాని జరుగుతుంది. ఇది సిస్టమిక్‌ లూపస్‌ ఎరిథమాటోసస్‌, డిస్కోయిడ్‌ లూపస్‌, సబ్‌ అక్యూట్‌ క్యూటేనియస్‌ ల్యూపస్‌, డ్రగ్‌ ఇండ్యూసెడ్‌ లూపస్‌, నియోనెటాల్‌ లూపస్‌ అనే రకాలుగా ఉంటుంది.

వ్యాధి లక్షణాలు
లూపస్‌ అన్ని రకాల అవయవాలపై ప్రభావం చూపే వ్యాధి. ముందుగా చర్మం, అనంతరం కీళ్లలో మొదలుకావచ్చు. కొందరిలో కేవలం జ్వరం, నీరసం, ఆకలి తగ్గిపోవడం వంటివి కనిపిస్తాయి. ముఖ్యంగా ముక్కుపై, చెంపపై మచ్చలు సీతాకోకచిలుక ఆకారంలో ఎర్రని దద్దుర్లు కనిపిస్తాయి. దీంతో పాటు జుట్టురాలిపోవడం, కీళ్లనొప్పి, ఉదయం లేవగానే కండరాలు పట్టేయడం (30 నిమిషాల పాటు) వంటి సమస్యలుంటాయి. గాఢంగా శ్వాస తీసుకున్నప్పుడు ఛాతిలో నొప్పి, చేతి, కాలివేళ్లు గోధుమరంగు, ఊదా రంగులోకి మారిపోవడం, నోటిలో పుండ్లు వస్తాయి.

సకాలంలో చికిత్స తీసుకోకపోతే...!
ఈ వ్యాధిని సకాలంలో గుర్తించి చికిత్స తీసుకుంటే ప్రాణాంతకం కాదు. ఒకవేళ సరిగా గుర్తించకపోవడం, మందులు సరిగా వాడకపోవడంతో శరీరంలో క్రానిక్‌ ఇన్‌ఫ్లమేషన్‌ ఉండి అనేక అవయవాలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది.

కిడ్నీ ఎఫెక్ట్‌ కావడం వల్ల మూత్రంలో ప్రొటీన్స్‌ ఎక్కువ మోతాదులో బయటకు వెళ్లిపోతాయి. ఆ తర్వాత కిడ్నీ మరింత తీవ్రంగా దెబ్బతింటుంది.

మెదడు, నరాలు దెబ్బతినడంతో తలనొప్పి, చూపు దెబ్బతినడం, మానసిక వ్యాధులు, పక్షవాతం, మూర్ఛవ్యాధి లాంటివి కూడా లూపస్‌లో భాగంగా వచ్చే ప్రమాదం ఉంది.

గుండెకండరాలు దెబ్బతిని కొన్నిసార్లు గుండెపోటు కూడా వచ్చే అవకాశం ఉంది.

శరీరంలో రోగనిరోధకశక్తి బలహీన పడటంతో పలుమార్లు ఇన్‌ఫెక్షన్స్‌ వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి.

ఎముకల్లో రక్తసరఫరా సరిగా లేకపోవడంతో ఎముకల్లో కణాలు చనిపోయి సులభంగా ఎముకలు విరిగిపోతాయి.

లూపస్‌ వ్యాధి ఉండే గర్భిణిల్లో అబార్షన్స్‌ ఎక్కువసార్లు అవుతాయి. మరికొందరిలో బీపీ అధికంగా ఉంటుంది.

ఎందుకు వస్తుందంటే...!
మొదటగా జీన్స్‌, పర్యావరణం (ఇన్‌ఫెక్షన్స్‌, కొన్ని రకాల మందులు, ఒత్తిడి, అధిక యువీ కిరణాలు) ప్రభావం వల్ల ఆటో ఇమ్యూన్‌ వ్యాధులు వస్తాయి. ముఖ్యంగా 15 నుంచి 45 ఏళ్లలోపు (9ః1 నిష్పత్తి) ఉన్న వారిలో వస్తుంది. అందుకు ఈస్ట్రోజెన్‌ అనే హార్మోన్‌ ప్రభావంతో వారిలో సహజంగానే వస్తుంది. అయితే ఇది చిన్నవారి నుంచి పెద్దవయస్సు వారి వారికి ఎవ్వరికై నా రావచ్చు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top