మాట్లాడుతున్న మేయర్ బుర్రి చైతన్య, పాల్గొన్న కార్పొరేటర్లు
నల్లగొండ టూటౌన్ : పార్టీలకతీతంగా అన్ని డివిజన్లను అభివృద్ధి చేసి నీలగిరి నగరాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుకుందామని మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య అన్నారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు అని, ఎన్నికల తరువాత అభివృద్ధిపైనే దృష్టి అని స్పష్టం చేశారు. సోమవారం నీలగిరి మున్సిపల్ కార్పొరేషన్ సాధారణ సమావేశానికి ఆమె అధ్యక్షత వహించి మాట్లాడారు. ఏ డివిజన్‌పై వివక్ష లేదని, అన్ని డివిజన్లలో అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ, సీసీ రోడ్ల పనులు నడుస్తున్నాయని తెలిపారు. యూజీడీ కోసం తవ్విన వెంటనే సీసీ రోడ్లు వేస్తే కుంగిపోయే అవకాశం ఉన్నందున రోడ్ల నిర్మాణం ఆలస్యం అవుతుందని, నాణ్యతగా ఉండాలనే ఉద్దేశంతో పనులు చేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ హాయంలో కళాభారతి నిర్మాణానికి నిధులు విడుదల కాలేదని, కేవలం ప్రొసీడింగ్స్ మాత్రమే వచ్చినట్లు తెలిపారు. కళాభారతి నిర్వహణ మున్సిపాలిటీకి బారం అయ్యే అవకాశం ఉన్నందున కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టి మున్సిపల్ కార్పొరేషన్ ఆదాయ వనరుల పెంపుదల కోసం మంత్రి వెంకట్‌రెడ్డి సహకారంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు. బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు మారగోని భవాని, మందడి లిఖితా, దొడ్డి రమేష్ మాట్లాడుతూ తాము కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి వ్యతిరేకం కాదని, దాంతో పాటే కళాభారతి నిర్మాణం కూడా చేపట్టాలని డిమాండ్ చేశారు. జీవీ గూడెం జంక్షన్ నుంచి అక్కలాయి గూడెం వరకు రోడ్డు వేయాలని 10వ డివిజన్ కార్పొరేటర్ పిల్లి కృషంరాజు కోరారు. విచ్చలవిడిగా ప్లెక్సీలు పెడుతున్నారని, వాటితో ప్రమాధాలు జరుగకుండా నియంత్రణ చేపట్టాలన్నారు. కాంగ్రెస్ కార్పొరేటర్లు కేసాని వేణుగోపాల్‌రెడ్డి, బొడ్డుపల్లి లక్ష్మి, ఇబ్రహీం, అల్లి సుబాష్ మాట్లాడుతూ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. సమావేశంలో కార్పొరేషన్ కమిషనర్ బి.వంశీకృష్ణ, డిప్యూటీ మేయర్ అమేర్ అలీ, ఈఈ మనోహర, ఏసీపీ కృష్ణవేణి, ఇతర అధికారులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
ఫ నీలగిరిని ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యం
ఫ కార్పొరేషన్ సమావేశంలో మేయర్ బుర్రి చైతన్య


