11 మంది సభ్యులతో యాదగిరిగుట్ట పాలకవర్గం | - | Sakshi
Sakshi News home page

11 మంది సభ్యులతో యాదగిరిగుట్ట పాలకవర్గం

Jul 1 2026 1:52 AM | Updated on Jul 1 2026 4:24 PM

-

ఎం. సత్యనారాయణరెడ్డి

టీటీడీ తరహాలో తొలిసారి వైటీడీ ఏర్పాటు

 గుట్ట బోర్డు చైర్మన్‌గా ఎంఎస్‌ఎన్‌ రెడ్డి

మరో ఏడుగురు ఎక్స్‌అఫీషియో సభ్యులు

ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలకు నిరాశ

సాక్షి, యాదాద్రి : యాదగిరిగుట్ట దేవస్థానం(వైటీడీ) బోర్డును ప్రభుత్వం ఎట్టకేలకు నియమించింది. ఒక చైర్మన్‌తో పాటు పది మంది సభ్యులు, మరో ఏడుగురు ఎక్స్‌అఫీషియో సభ్యులతో పాలకవర్గాన్ని నియమిస్తూ ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజారామయ్యర్‌ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. యాదగిరిగుట్ట దేవస్థానానికి 2009 సంవత్సరం వరకు సాధారణ పాలకవర్గం ఉంది. ఆ పాలకవర్గం పదవీకాలం ముగిసిన తర్వాత ఆలయ ఈవోలతోనే నడిపించారు. గత ప్రభుత్వ హయాంలో ఆలయ పునర్నిర్మాణం జరిగింది. అయితే, పూర్తిగా అధికారుల ఆధ్వర్యంలోనే కార్యక్రమాలు కొనసాగుతూ వచ్చాయి.

అస్తవ్యస్తంగా పాలన..

దేవస్థానానికి పాలకవర్గం లేకపోవడంతో దేవస్థానంలో అధికారుల హవా కొనసాగింది. దీంతో పలు ఆరోపణలు వచ్చాయి. దేవస్థానం అధికారి ఏసీబీకి పట్టుబడడం, డాలర్లు మాయం కావడం. దేవస్థానం గోదాం నుంచి సరుకులు దొంగిలించుకుపోతుండగా పోలీసులు పట్టుకోవడం, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల నియామకం, దేవస్థానంలో దుకాణాల కేటాయింపులో అక్రమాలు వంటి పలు అంశాలు రచ్చ కెక్కాయి. అలాగే భక్తుల సౌకర్యాల కంటే దేవస్థానంలో వీఐపీలకే అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారన్న ఫిర్యాదులు వచ్చాయి. దీనికి తోడు దేవాలయం ఉద్ఘాటన తర్వాత ఒక్క రోజు లక్ష మంది భక్తులు రావడంతో సౌకర్యాల కొరత కనిపించింది.

బోర్డు ఏర్పాటుపై రెండేళ్ల క్రితం సీఎం ప్రకటన

సీఎం రేవంత్‌రెడ్డి రెండవసారి 2024 నవంబర్‌ 8న యాదగిరిగుట్టకు వచ్చినప్పుడు దేవస్థానం పాలకవర్గం నియామకంపై ప్రకటన చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు తరహాలో యాదగిరిగుట్ట దేవస్థానం (వైటీడీ) బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. గుట్టలో ప్రకటించిన విధంగానే యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు బిల్లును 2025 మార్చి18న అసెంబ్లీలో ఆమోదించారు. నూతన చట్టం ప్రకారం 11 మంది సభ్యులు, ఏడుగురు ఎక్స్‌అఫీషియో సభ్యులతో యాదగిరిగుట్ట ఆలయ బోర్డు ఏర్పాటైంది. 

ఇందులో వివిధ వర్గాలకు చెందిన వారిని ప్రభుత్వం నామినేట్‌ చేసింది. వీరితోపాటు వంశపారంపర్య ధర్మకర్త కూడా సభ్యుడిగా ఉన్నారు. ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, రెవెన్యూ శాఖ(ఎండోమెంట్‌) ముఖ్య కార్యదర్శి, దేవాదాయ శాఖ కమిషనర్‌, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌, దేవస్థానం ఈవో, వై టీడీఏ వైస్‌ చైర్మన్‌, సీనియర్‌ ప్రధానార్చకుడు ఉంటారు. బోర్డు కాలపరిమితి రెండేళ్లు ఉంటుంది.

చైర్మన్‌గా సత్యనారాయణరెడ్డి
యాదగిరిగుట్ట దేవస్థానం (వైటీడీ) బోర్డు చైర్మన్‌గా ఎం.సత్యనారాయణరెడ్డి నియమితులయ్యారు. మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఎంఎస్‌ఎన్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ అధినేత డాక్టర్‌ మన్నె సత్యనారాయణరెడ్డి ఫార్మారంగంలో సేవలందిస్తున్నారు. ఒక సాధారణ కెమిస్ట్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి నేడు ఫార్మా రంగంలో తిరుగులేని శక్తిగా ఎదిగారు.

సభ్యులు వీరే..

వినోద్‌ వెంకటస్వామి : మాజీ కేంద్ర మంత్రి జి.వెంకటస్వామి కుమారుడు, బెల్లంపల్లి ఎమ్మెల్యే

కొణిదెల సురేఖ : ప్రముఖ సినీనటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి సతీమణి

సి.విజయారాజం : ప్రముఖ పారిశ్రామికవేత్త సీఎల్‌ రాజం సతీమణి

తూళ్ల విజయేందర్‌ : మాజీ హోం మంత్రి తూళ్ల దేవేందర్‌గౌడ్‌ కుమారుడు

స్వాతి కంఠమని : నాట్కో ఫార్మా యాజమాన్యానికి చెందిన వారు

గుండు మల్లయ్య : హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన ఆధ్యాత్మికవేత్త

ఎం.రాఘవేందర్‌రావు : సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఎం.రఘునందన్‌రావు తండ్రి ఎం,రాఘవేందర్‌రావు

డాక్టర్‌ లక్ష్మీనారాయణనాయక్‌ : వరంగల్‌ జిల్లా పరిషత్‌ మాజీ చైర్‌పర్సన్‌ ధన్వంతి భర్త, జనగామ జిల్లా కేంద్రంలో ప్రముఖ వైద్యుడు

పోచబోయిన ఈశ్వరమ్మయాదవ్‌ : హైదరాబాద్‌లోని వనస్థలిపురం ప్రాంతానికి చెందిన మాజీ కార్పొరేటర్‌

బి.నర్సింహ మూర్తి : యాదరిగుట్ట ఆలయ వంశపారంపర్య ధర్మకర్త

ఉమ్మడి నల్లగొండ జిల్లా వారికి దక్కని చోటు!
ప్రభుత్వం నియమించిన యాదగిరిగుట్ట టెంపుల్‌ డెవలప్‌ మెంట్‌బోర్డులో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు అవకాశం దక్కలేదు. ఉమ్మడినల్లగొండకు చెందిన పలువురు కాంగ్రెస్‌ నాయకులు ఎంతో కాలంగా దేవస్థానం పాలక మండలి పదవులను ఆశించారు. కానీ, ఎవరికీ అవకాశం దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement