యాసంగి సన్నాలకు | - | Sakshi
Sakshi News home page

యాసంగి సన్నాలకు

May 16 2026 11:01 PM | Updated on May 16 2026 11:01 PM

మార్కెట్‌లో నాణ్యమైన విత్తనాలు

నల్లగొండ అగ్రికల్చర్‌, పెద్దవూర : యాసంగిలో సన్నాలు సాగు చేసి ప్రభుత్వ కేంద్రాల్లో విక్రయించిన రైతులకు ప్రభుత్వం బోనస్‌ ఇవ్వలేదు. కేవలం వానాకాలం కొనుగోలు చేసిన సన్నాలకే పరిమితం చేసింది. సన్నాల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం 2024–25 వానాకాలం నుంచి క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్‌ ఇస్తామని ప్రకటించింది. కానీ ఆ నిర్ణయం కేవలం వానాకాలం సాగుకే అమలవుతోంది. గత యాసంగి బోనస్‌ ఇవ్వలేదు. ఈ యాసంగిలో అసలు బోనస్‌పై ఎలాంటా ప్రకటనా చేయలేదు. మరోవైపు ఈ వానాకాలం నుంచి తాము సూచించిన 8 రకాల సన్నాలకే బోనస్‌ ఇస్తామని వ్యవసాయ శాఖ ప్రచారం చేస్తోంది. దీంతో రైతులు ఏ రకాలు సాగు చేయాలోనని గందరగోళం చెందుతున్నారు.

రూ.10.97 కోట్లు పెండింగ్‌

2024–25 వానాకాలం సీజన్‌లో రైతుల నుంచి 74,393 మెట్రిక్‌ టన్నుల సన్న ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. వారందరికి కనీస మద్దతు ధర చెల్లించడంతో పాటు క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్‌ను కూడా విడుదల చేసింది. ఆ సీజన్‌లో రూ.37.20 కోట్లను రైతులకు బోనస్‌ కింద జమ చేసింది. కానీ 2024–25 యాసంగి సీజన్‌లో రైతులు పండించిన సన్నాలు 21,939 మెట్రిక్‌ టన్నుల దాన్యం కొనుగోలు చేసింది. బోనస్‌ కింద రూ.10.97 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉన్నా ఇంత వరకు విడుదల చేయలేదు.

ఈ యాసంగిలో బోనస్‌ ఊసే లేదు..

2025–26 వానాకాలం సీజన్‌లో ప్రభుత్వం 1,48,812 మెట్రిక్‌ టన్నుల సన్న దాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసింది. కానీ.. యాసంగి సీజన్‌ బోనస్‌ను విడుదల చేయని ప్రభుత్వం 2025–26 సీజన్‌కు సంబంధించిన వానాకాలం బోనస్‌ కింద రూ.74.41 కోట్లను విడుదల చేయడం విశేషం. తిరిగి 2025–26 యాసంగి సీజన్‌ కూడా ముగిసి ధాన్యం కొనుగోళ్లు సాగుతున్నా.. గత యాసంగి సీజన్‌కు సంబంధించిన బోనస్‌పై నోరు మొదపడం లేదు. అసలు యాసంగి సీజన్‌కు బోనస్‌ ఎందుకు ఇవ్వడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. వెంటనే 2024–25, 2025–26 యాసంగి సీజన్లకు సంబంధించిన బోనస్‌ను ఖాతాల్లో జమ చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

తాము చెప్పిన రకాలే సాగు చేయాలి..

వానాకాలంలో సాగు చేసే వరి సన్నాల్లో తాము సూచించే ఎనిమిది రకాలనే సాగు చేయండి.. బోనస్‌ పొందండి అంటూ వ్యవసాయశాఖ ప్రచారం చేపట్టింది. సన్నాల్లో ఎన్నో రకాలు ఉండగా కేవలం ఎనిమిది రకాలనే ప్రమోషన్‌ చేస్తూ ప్రచారం చేస్తుండటంతో రైతుల్లో గందరగోళం నెలకొంది. గడిచి రెండు వానాకాలం సీజన్లలో సన్నాల్లో ఏ రకం సాగు చేసి విక్రయించినా ప్రభుత్వం బోనస్‌ను అందించింది. 2026 వానాకాలం సీజన్‌కు సంబంధించి మాత్రం 8 రకాలనే వ్యవసాయ శాఖ ప్రమోషన్‌ చేయాలని నిర్ణయించడం.. రైతులను అయోమయానికి గురి చేస్తోంది. ఒకవేళ ప్రభుత్వం సూచించిన 8 రకాలనే సాగు చేయాలంటే విత్తనాలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయా అనే అనుమానం నెలకొంది.

ఫ ఏడాది గడిచినా రైతులకు

అందని పోత్సాహకం

ఫ వానాకాలం సన్నాలకే

బోనస్‌ ఇస్తున్న ప్రభుత్వం

ఫ యాసంగిలో సన్నాలు సాగు చేసినా ప్రయోజనం లేదంటున్న రైతులు

ఫ 8 రకాలకే బోనస్‌ ఇస్తామంటూ

ఇప్పుడు వ్యవసాయ శాఖ ప్రచారం

ఈ ఫొటోలోని రైతు మాడ్గులపల్లి మండల కేంద్రానికి చెందిన పుల్లెంల యాదగిరి. ఈ రైతు గత యాసంగిలో 16 ఎకరాల్లో పండిన 437 క్వింటాళ్ల సన్నరకం ధాన్యాన్ని ఐకేపీ కేంద్రంలో అమ్మాడు. ప్రభుత్వం సన్నాలకు రూ.500 బోనస్‌ ఇస్తామని చెప్పడంతో తనకు మద్దతు ధరతోపాటు రూ.2,18,500 వస్తాయని లెక్కలు వేసుకున్నాడు. కానీ ప్రభుత్వం బోనస్‌ ఇవ్వలేదు. గత వానాకాలంలో ఐకేపీలో సన్న ధాన్యం అమ్మిన బోనస్‌ వచ్చింది. దీంతో ఈ యాసంగి సీజన్‌లో కూడా 318 క్వింటాళ్ల సన్న ధాన్యం ఐకేపీలో విక్రయించాడు. ఈ యాసంగిలోనైనా ప్రభుత్వం బోనస్‌ ఇస్తుందా లేదా అని ఆందోళన చెందుతున్నాడు.

సన్నాల్లో ఎన్నో రకాలు ఉండగా రోగాల బారిన పడని, తక్కువ వ్యవధిలో పంట చేతికి వచ్చేవి, కలుపు ఇబ్బందులు లేని రకాలను సాగు చేయడానికి రైతులు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం సూచించిన రకాల్లో కొన్నింటికి దిగుబడి ఆశించినంతగా రాదని రైతులు చెబుతున్నారు. అలాగే రోగాల బారిన పడే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ప్రభుత్వం సూచించే 8 రకాల కంటే ఎంతో నాణ్యమైన విత్తనాలు మార్కెట్‌లో ఉన్నాయని రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. సన్న రకాలకు బోనస్‌ అనే హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉండాలని, అంతేకాని తాము సూచించిన రకాలకే బోనస్‌ వర్తిస్తుందనే ప్రకటనను ఉపసంహరించుకోవాలని రైతులు కోరుతున్నారు. వానాకాలం సాగుకు అవసరమైన వరి విత్తనం సేకరణలో బిజీగా ఉన్న రైతులకు వ్యవసాయ శాఖ చేస్తున్న ప్రచారం అయోమయంలోకి నెట్టిందని, దీనిపై ప్రభుత్వం పునఃపరిశీలన చేయాలని పలువురు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement