నామినేషన్లకు నేడు ఆఖరు | - | Sakshi
Sakshi News home page

నామినేషన్లకు నేడు ఆఖరు

Jan 30 2026 7:02 AM | Updated on Jan 30 2026 7:02 AM

నామినేషన్లకు నేడు ఆఖరు

నామినేషన్లకు నేడు ఆఖరు

మున్సిపాలిటీ వారీగా దాఖలైన నామినేషన్లు

నేడు భారీగా దాఖలయ్యే అవకాశం

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మున్సిపాలిటీల్లో నామినేషన్ల దాఖలు ఊపందుకుంది. మొదటి రోజు మందకొడిగానే దాఖలయ్యారు. రెండో రోజైన గురువారం మాత్రం జిల్లా వ్యాప్తంగా వందల సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లకు శుక్రవారం ఒక్క రోజే గడువు ఉంది. నల్లగొండ కార్పొరేషన్‌తోపాటు చిట్యాల, చండూరు, దేవరకొండ, హాలియా, నందికొండ, మిర్యాలగూడ మున్సిపాలిటీల్లో రెండు రోజుల్లో 607 నామినేషన్లు దాఖలు చేయగా, బుధవారం 44 నామినేషన్లు దాఖలు కాగా, గురువారం ఒక్కరోజే 563 దాఖలు చేశారు.

ఊపందుకున్న నామినేషన్లు

మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన రెండో రోజు నామినేషన్లు ఊపందుకున్నాయి. ఈ నెల 27న ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసిన ఎన్నికల సంఘం 28వ తేదీ నాడే నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించింది. మొదటి రోజైన బుధవారం కొద్ది మందే నామినేషన్లు దాఖలు చేశారు. ఎక్కువ మంది ఆ రోజంతా నామినేషన్ల పత్రాలను ిసిద్ధం చేసుకునే పనిలోనే ఉండగా, ముందస్తుగా సిద్ధ్దమైన వారు కొన్ని సెట్లు వేశారు. రెండో రోజు నామినేషన్ల తాకిడి బాగా పెరిగింది. ఎన్నికల షెడ్యూల్‌, వెనువెంటనే నోటిఫికేషన్‌ విడుదల చేయడంతో నామినేషన్లకు తక్కువ గడువే వచ్చింది. కేవలం మూడు రోజులే ఇవ్వడంతో పోటీ చేయాలనుకునే అభ్యర్థులతో పాటు రాజకీయ పార్టీల్లో హడావుడి నెలకొంది. అంతా ఉరుకులు..పరుగులు. కొన్ని పార్టీలు అభ్యర్థుల ఖరారు పూర్తి స్థాయిలో చేయలేదు. పోటీ చేయాలనుకున్న వారు మున్సిపాలిటీలో ఇళ్లు, నల్లా తదితర పన్నులు చెల్లించడం, బ్యాంకులో అకౌంట్లు తీసుకోవడం, ఇతర నోడ్యూస్‌ సర్టిఫికెట్లు తీసుకునే పనిలో పడ్డారు. దీంతో అన్ని మున్సిపాలిటీల్లో హడావుడి నెలకొంది.

మేయర్‌, చైర్మన్‌ అభ్యర్థులను

ప్రకటించని పార్టీలు

జిల్లాలో అన్ని పార్టీలు మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థుల పేర్లను ప్రకటించాల్సి ఉంది. నల్లగొండ కార్పొరేషన్‌లో మాత్రం కాంగ్రెస్‌ మేయర్‌ అభ్యర్థి బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డిని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించారు. ఇక్కడ బీఆర్‌ఎస్‌, బీజేపీ, ఇతర పార్టీలు ఇంకా ప్రకటించాల్సి ఉంది. బీఆర్‌ఎస్‌ నుంచి మేయర్‌ అభ్యర్థిగా చకిలం వసంతలక్ష్మి అనిల్‌కుమార్‌ ఉంటారనే చర్చ జరుగుతున్నా పార్టీ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. బీజేపీ కార్పొరేటర్‌ అభ్యర్థులతోపాటు మేయర్‌ అభ్యర్థులనూ ప్రకటించాల్సి ఉంది. మిగతా మున్సిపాలిటీల్లో చైర్మన్‌ అభ్యర్థులను అన్ని పార్టీలు ప్రకటించాల్సి ఉంది.

మున్సిపాలిటీ గురువారం బుధవారం మొత్తం

నల్లగొండ కార్పొరేషన్‌ 168 11 179

మిర్యాలగూడ 176 04 180

దేవరకొండ 79 10 89

చిట్యాల 44 09 53

చండూరు 29 04 33

హాలియా 40 00 40

నందికొండ 27 06 33

రెండు రోజుల్లో 607 దాఖలు

ఫ మున్సిపాలిటీల్లో జోరుగా నామినేషన్లు

ఫ మొదటి రోజు మందకొడిగానే..

ఫ రెండో రోజు వందల సంఖ్యలో..

ఫ నామినేషన్‌ దాఖలు

కేంద్రాల వద్ద పటిష్ట చర్యలు

నామినేషన్లకు శుక్రవారమే చివరి గడువుగా ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆఖరిరోజైన శుక్రవారం పెద్ద ఎత్తున నామినేషన్లు సమర్పించే అవకాశం ఉంది. జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ మెజారిటీ అభ్యర్థులను ప్రకటించింది. నల్లగొండ కార్పొరేషన్‌లో మొత్తం 48 డివిజన్లకు ప్రకటించింది. బీఆర్‌ఎస్‌ పార్టీ బుధవారం 18 మంది అభ్యర్థులను ప్రకటించగా, గురువారం రాత్రి 24 మందిని ప్రకటించింది. మరో ఆరుగురిని ప్రకటించాల్సి ఉంది. బీజేపీ ఇంకా అభ్యర్థులనే ప్రకటించలేదు. దీంతో పార్టీ నుంచి టికెట్‌ ఖరారుకాని వారు నామినేషన్లను గురువారం కూడా దాఖలు చేయలేదు. శుక్రవారం ఆఖరు తేదీ కావడంతో శుక్రవారం ఉదయం నాటికి ప్రకటించే అవకాశం ఉంది. నామినేషన్లకు శుక్రవారం ఆఖరి రోజు కావడంతో సాయంత్రం 5 గంటల్లోగా నామినేషన్లు సమర్పించేందుకు వచ్చిన వారి పత్రాలను అధికారులు తీసుకుంటారు. ఆ తర్వాత వచ్చిన వారివి తిరస్కరించనున్నారు. చివరి రోజు ఎక్కడా ఇబ్బందులు లేకుండా ఎన్నికల అధికారులు కౌంటర్లు పెంచి నామినేషన్లు తీసుకోవాలని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement