అపరాలు అంతంతే..
ఏటా అపరాల సాగు తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. సాగు తగ్గడం వల్ల పప్పుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. పప్పు ధాన్యాల పంటలు సాగు చేసేలా రైతుల్లో అవగాహన కల్పిస్తాం.
– పాల్వాయి శ్రవణ్‌కుమార్,
జిల్లా వ్యవసాయాధికారి
నల్లగొండ అగ్రికల్చర్ : జిల్లాలో పప్పు ధాన్యాలైన కంది, బొబ్బెర, పెసర, మినుము (అపరాల) పంటల సాగు ఏటేటా గణనీయంగా తగ్గుతోంది. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో సాగు చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ రైతులు అపరాల సాగుపై ఆసక్తి చూపడం లేదు. కేవలం దేవరకొండ డివిజన్‌లో కొన్ని మండలాల్లో మాత్రమే పప్పు ధాన్యాల పంటలు సాగవుతున్నాయి. జిల్లాలో నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ద్వారా ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు ద్వారా కొన్ని సంవత్సరాలుగా సాగునీరు విడుదలవుతున్న నేపథ్యంలో జిల్లా రైతులు వాణిజ్య పంటలైన పత్తి, వరి, మిరప పంటల సాగును పెద్ద ఎత్తున చేస్తున్నారు.
సాగు తగ్గడంతో పప్పుల ధరలు పెరుగుదల
జిల్లాలో గతంలో రైతులు కంది, పెసర, మినుము, బొబ్బర్ల వంటి పప్పు ధాన్యాల పంటలను పెద్ద ఎత్తున సాగు చేసేవారు. కందులను రికార్డు స్థాయిలో లక్షల క్వింటాళ్లను పండించిన చరిత్ర జిల్లా రైతులకు ఉంది. అయితే పంట చేతికొచ్చిన తర్వాత అమ్ముకోవడానికి అప్పట్లో మార్కెటింగ్ సౌకర్యం లేక రైతులు నానా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. అప్పటి ప్రభుత్వాలు కంది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ సరైన మద్దతు ధర లేకపోవడం, డబ్బులు సకాలంలో ఇవ్వకపోవడంతో సాగు చేసేందుకు రైతులు వెనుకాడేవారు. అలాగే పెసర్లు పండించిన అమ్ముకోవడానికి కష్టాలు పడాల్సి వచ్చేది. దీంతో రైతులు పప్పు ధాన్యాల పంటలను తగ్గించి వాణిజ్య పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా పప్పు ధాన్యాల సాగు తగ్గడం వల్ల కంది, పెసర, మినుము తదితర పప్పుల ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.
ప్రభుత్వం ప్రోత్సాహం లేక..
పప్పు ధాన్యాల సాగు పెంచేందుకు రైతులను ప్రభుత్వం ప్రోత్సహించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రైతులకు సబ్సిడీపై విత్తనాలు, ఎరువులను అందించడంతో పాటు పంటల సాగుపై పెద్ద ఎత్తున అవగాహన కల్పించడం లేదు. ఒకవేళ పప్పు ధాన్యాలు పండించినా వాటి ఉత్పత్తులను అమ్ముకోవడానికి సరైన మార్కెట్ సౌకర్యం లేదు. ఈ నేపథ్యంలో రైతులను ప్రోత్సహించి సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు అందించడంతోపాటు మార్కెట్ సౌకర్యం కల్పిస్తే పప్పు ధాన్యాల సాగు పెరిగే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఏటేటా తగ్గుతున్న పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణం
ఫ సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు
అందించకపోవడమే కారణం
ఫ వాణిజ్య పంటలైన వరి,
పత్తి సాగుకే రైతుల మొగ్గు
జిల్లాలో పప్పు ధాన్యాల సాగు ఇలా.. (ఎకరాల్లో..)
సంవత్సరం సీజన్ కంది మినుము పెసర
2021 వానాకాలం 10,807 08 329
యాసంగి 28 1,214 2,213
2022 వానాకాలం 3,273 38 88
యాసంగి 05 55 1,252
2023 వానాకాలం 942 76 548
యాసంగి 176 203 649
2024 వానాకాలం 2,479 526 1,330
యాసంగి 77 600 890
2025 వానాకాలం 1,780 28 403
యాసంగి 45 325 418
మొత్తం 19,612 3,073 5,819


