కుమారుడికి అనారోగ్యం.. తండ్రి ఆత్మహత్య
నకిరేకల్ : కుమారుడు మూత్రపిండాల వ్యాధితో బాధపడుతుండడం, అతడి వైద్యం కోసం చేసిన అప్పులు పెరిగిపోవడంతో మనోవేదనకు గురైన తండ్రి గుళికల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం మంగళపల్లి గ్రామంలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళపల్లి గ్రామానికి చెందిన షేక్ జహంగీర్(60)కు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. జహంగీర్ కూమారుడు సయ్యద్ మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నాడు. గ్రామంలో పలువురి వద్ద అప్పు తెచ్చి మరీ తన కుమారుడికి వైద్యం చేయిస్తున్నా వ్యాధి నయంకాకపోవడంతో మనోవేదనకు గురైన జహంగీర్ బుధవారం తెల్లవారుజామున ఇంట్లో గుళికల మందు తాగాడు. మంచంపై పడి నురగలు కక్కుతున్న జహంగీర్‌ను కటుంబ సభ్యులు వెంటనే నకిరేకల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నల్లగొండలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే అతడు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. జహంగీర్ కుమారుడు సయ్యద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వీరబాబు తెలిపారు.


