పూర్వగిరికి బ్రహ్మోత్సవ శోభ
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట క్షేత్రానికి అనుబంధంగా కొనసాగుతున్న పూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం నిత్యారాధానల అనంతరం వార్షిక బ్రహ్మోత్సవాలకు అర్చకులు శ్రీకారం చుట్టారు. మొదటి రోజు స్వస్తీవాచనం, విష్వక్సేనారాధనలు మొదటి పూజగా నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులకు రక్షాబంధనం వేడుక జరిపించారు. స్థల, ద్రవ్య శుద్ధి కొరకు మూలవరులకు, ఆలయ పరిసర ప్రాంతంలో మంత్ర జపములను ప్రోక్షణ చేశారు. ప్రధానాలయంలో, ముఖ మండపంలో, కల్యాణ మండపం, ఆలయ పరిసరాలు, వేంచేపు మండపం, ధ్వజ స్తంభం ప్రాంతాల్లో శుద్ధ జలంతో పుణ్యాహవాచనం జరిపించారు. తొలి పూజలో ఆలయ అనువంశిక ధర్మకర్త బి. నర్సింహమూర్తి, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ కె. వినోద్‌రెడ్డి, డిప్యూటీ ఈఓ భాస్కర్‌శర్మ, ప్రధానార్చకులు, పారాణీకులు, రుత్వికులు, అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
సాయంత్రం అంకురారోపణం..
సాయంత్రం ఆలయ మండపంలో అంకురారోపణం, మృత్సంగ్రహణ వేడుకలు నిర్వహించారు. ఆలయం నుంచి పురవీధుల గుండా వేంచేపు మండపానికి చేరుకుని భూమాతను పూజించి, మృత్తికను(మట్టిని) సేకరించారు. తిరిగి ఆ మృత్తికను ప్రధానాలయంలోని ముఖ మండపంలో ఏర్పాటు చేసిన యాగశాలలోని పాలికలలో నింపి, వాటిలో నవధాన్యాలు చల్లారు. ఉత్సవ సమాప్తి వరకు పాలు, శుద్ధ జలాలలో పాలికలను తడిపి నిత్యం ఆరాధనలు గావిస్తామని అర్చకులు వెల్లడించారు. ఈ వేడుకలను ప్రధాన అర్చకులు, యజ్ఞచార్యులు, అర్చక బృందం, పారాయణీకులచే నిర్వహించారు.
ఉత్సవాల్లో నేడు..
బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం ధ్వజారోహణం, అగ్ని ప్రతిష్ఠ, మూలమంత్ర హవనం, వేద పారాయణం నిర్వహిస్తారు. సాయంత్రం భేరి పూజ, దేవతాహ్వానం జరిపిస్తారు. ధ్వజరోహణం జరిగే సమయంలో ఆచార్యులు ధ్వజ స్తంభం వద్దకు వచ్చి పూజలు నిర్వహిస్తారు.
ఫ స్వస్తీవాచనం, విష్వక్సేనారాధనతో ప్రారంభమైన ఉత్సవాలు
ఫ నేడు ధ్వజారోహణం,
భేరి పూజ, దేవతాహ్వానం


