
యూరియా కొరత లేదు
నల్లగొండ: జిల్లాలో యూరియాకు ఎలాంటి కొరత లేదని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. సోమవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్పరెన్స్‌కు కలెక్టరేట్ నుంచి ఆమె హాజరై మాట్లాడారు. జిల్లాలో సుమారు 70 శాతం మంది రైతులు యూరియాను కొనుగోలు చేశారన్నారు. నానో యూరియాను వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. వ్యవసాయానికి కాకుండా పరిశ్రమలు, ఇతర పనులకు యూరియా వాడితే క్రిమినల్ కేసు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. యూరి యా పక్కదారి పట్టకుండా టాస్క్ ఫోర్స్ కమిటీలు నిరంతరం తనిఖీలు నిర్వహించాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్పీ శరత్‌చంద్ర పవార్, డీఏఓ శ్రవణ్ కుమార్, జిల్లా మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకురాలు ఛాయాదేవి, జిల్లా సహకార శాఖ అధికారి పత్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.
బాధితులకు భరోసా కల్పించాలి
నల్లగొండ: పోలీస్ గ్రీవెన్స్ డేకు వచ్చిన అర్జీలను వేగంగా పరిష్కరిస్తూ బాధితులకు భరోసా కల్పించాలని ఎస్పీ శరత్‌చంద్ర పవార్ పోలీస్ అధికారులకు సూచించారు. సోమవారం నల్లగొండలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్ డేకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా 38 మంది బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. బాధితులతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులకు ఫోన్ చేసి పూర్తి వివరాలు సమర్పించాలన్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలన్నారు. వారి ఫిర్యాదులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని పోలీసులను ఆదేశించారు. ఎవరైనా శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు.
చిన్నారుల భద్రతపై
నేటి నుంచి టీచర్లకు శిక్షణ
నల్లగొండ: ఈ నెల 19 నుంచి సెప్టెంబర్ 9వ తేదీ వరకు జిల్లాలోని 229 ఉన్నత పాఠశాలల నుంచి 229 మంది టీచర్లకు బాలల భద్రత, అక్రమ రవాణా అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు డీఈఓ భిక్షపతి ఒక ప్రకటనలో తెలిపారు. నల్లగొండలోని డైట్ కళాశాలలో నాలుగు విడతలుగా శిక్షణ తరగతులు కొనసాగుతాయని పేర్కొన్నారు. మొదటి విడత ఈ నెల 19, 20 తేదీల్లో, రెండో విడత 21, 22 తేదీల్లో, 3వ విడత 28, 29న నాలుగవ విడత సెప్టెంబర్ 8, 9 తేదీల వరకు శిక్షణ తరగతులు ఉంటాయని, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు.

యూరియా కొరత లేదు