16న టేబుల్‌ టెన్నిస్‌, తైక్వాండో ఎంపిక పోటీలు | - | Sakshi
Sakshi News home page

16న టేబుల్‌ టెన్నిస్‌, తైక్వాండో ఎంపిక పోటీలు

Nov 14 2023 1:52 AM | Updated on Nov 14 2023 1:52 AM

తిప్పర్తి : కొనుగోలు కేంద్రంలో సిబ్బందితో మాట్లాడుతున్న డీఎస్‌ఓ వెంకటేశ్వర్లు - Sakshi

తిప్పర్తి : కొనుగోలు కేంద్రంలో సిబ్బందితో మాట్లాడుతున్న డీఎస్‌ఓ వెంకటేశ్వర్లు

నల్లగొండ టూటౌన్‌: ఉమ్మడి జిల్లాస్థాయి టేబుల్‌ టెన్నిస్‌, తైక్వాండో బాలబాలికల జట్ల ఎంపిక పోటీలు ఈనెల 16వ తేదీన నల్లగొండలోని ఇండోర్‌ స్టేడియంలో నిర్వహించనున్నట్లు ఎస్‌జీఎఫ్‌ (అండర్‌–19) జిల్లా కార్యదర్శి కె.ఇందిర సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 16న ఉదయం 10 గంటలకు బోనఫైడ్‌, పదో తరగతి మెమో జిరాక్స్‌ ప్రతులతో హాజరు కావాలని సూచించారు. పూర్తి వివరాలకు కె.నర్సిరెడ్డి సెల్‌ : 9440072854 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

అవుట్‌ సోర్సింగ్‌ కార్మికుడి తొలగింపు

నల్లగొండ టూటౌన్‌: నీలగిరి మున్సిపాలిటీకి చెందిన అవుట్‌ సోర్సింగ్‌ పారిశుద్ధ్య కార్మికుడు షేక్‌ అన్వర్‌ను విధుల నుంచి తొలగిస్తూ మున్సిపల్‌ కమిషనర్‌ కేవీ.రమణాచారి ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల నియమ నిబంధనలు ఉల్లంఘించి ఒక పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నాడనే ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో అతడిని విధుల తొలగించాలని అవుట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీకి కూడా కమిషనర్‌ నోటీస్‌ జారీ చేశారు.

రైతుల ఖాతాల్లో రూ.167 కోట్లు జమ

రామగిరి(నల్లగొండ): వానాకాలం సీజన్‌లో జరిగిన ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి జిల్లాలో ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో 167.89 కోట్ల రూపాయలు జమ చేసినట్లు డీఎస్‌ఓ వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం తిప్పర్తి మండలం అంతయ్యగూడెం, రాయినిగూడెం, తిప్పర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు 22,677 మంది రైతుల నుంచి 1,64,350 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. కొనుగోళ్ల వివరాలను ఎప్పటికప్పుడు ట్యాబ్‌లో నమోదు చేసి రైతులకు త్వరితగతిన డబ్బులు అందేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాల నిర్వాహకులకు సూచించారు. ఆయన వెంట డీఎం నాగేశ్వర్‌రావు, ఆర్‌ఐ లింగస్వామి ఉన్నారు.

నేటి నుంచి క్రీడాకారుల ఎంపిక పోటీలు

మునగాల(కోదాడ): ఉమ్మడి నల్లగొండ జిల్లాస్థాయిలో క్రీడాకారుల ఎంపిక పోటీలు మంగళవారం నుంచి ఈనెల 18వరకు నిర్వహించనున్నట్లు సూర్యాపేట జిల్లా స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఎండీ.ఆజంబాబా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని జిల్లా పరిషత్‌ , కస్తూరిబా, మోడల్‌స్కూల్‌, సొషల్‌ వెల్ఫేర్‌ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చని సూచించారు. మంగళవారం 14, 17సంవత్సరాల బాలబాలికలకు సూర్యాపేట జిల్లాస్థాయి క్రికెట్‌ కీడాకారుల ఎంపిక పోటీలు జిల్లా కేంద్రలోని కుడకుడ రోడ్డులో గల క్రికెట్‌ స్టేడియంలో జరుగుతాయని, బుధవారం ఉమ్మడి జిల్లాస్థాయి ఫుట్‌బాల్‌ క్రీడాకారుల ఎంపికలు నడిగూడెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్నట్లు తెలిపారు. 16న ఉమ్మడి నల్లగొండ జిల్లాస్థాయి అథ్లెటిక్స్‌ ఎంపిక పోటీలు జిల్లా కేంద్రంలోని ఎస్వీ కళాశాల ఆవరణలో జరుగుతాయని, 18న ఉమ్మడి నల్లగొండ జిల్లాస్థాయి క్రికెట్‌ విభాగంలో 17సంవత్సరాల బాలబాలికల్లో ప్రతిభ గల క్రీడాకారుల ఎంపికలకు జిల్లా కేంద్రంలోని కుడకుడ రోడ్డులో గల క్రికెట్‌స్టేడియంలో పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ పోటీలు, ఎంపికలకు హాజరయ్యే బాలబాలికలు ఆయా తేదీల్లో ఉదయం 9గంటల కల్లా తనకు రిపోర్టు చేయాల్సి ఉంటుందని సూచించారు.

యాదాద్రిలో ధనలక్ష్మీ పూజ

యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ధనలక్ష్మీ పూజను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ఆలయ ముఖ మండపంలో అధిష్టించారు. వేద పారాయణాలు పఠిస్తూ ధనలక్ష్మి పూజ చేశారు. ఈ వేడుకలో ఈఓ గీతారెడ్డి, అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి, అర్చకులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు. అంతకుముందు స్వాతి నక్షత్రం సందర్భంగా శ్రీస్వామి, అమ్మవార్లకు శతఘటాభిషేకం నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement