అమ్మా.. నాన్నను చంపుతున్నారు.. ‘నువ్వు పడుకో రా’ | - | Sakshi
Sakshi News home page

అమ్మా.. నాన్నను చంపుతున్నారు.. ‘నువ్వు పడుకో రా’

Sep 26 2023 1:22 AM | Updated on Sep 26 2023 2:17 PM

- - Sakshi

బొగ్గు బట్టీల వద్ద కాపలాగా భార్య, కుమారుడితో కలసి నిద్రిస్తున్న వ్యక్తిని దుండగులు దారుణంగా హత్య చేశారు.

నల్గొండ: బొగ్గు బట్టీల వద్ద కాపలాగా భార్య, కుమారుడితో కలసి నిద్రిస్తున్న వ్యక్తిని దుండగులు దారుణంగా హత్య చేశారు. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం నాణ్యతండా ఆవాసం పూర్యతండా సమీపంలో గుట్టల వద్ద ఆదివారం రాత్రి జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నూతనకల్‌ మండలం బక్కహేమ్లాతండాకు చెందిన గుగులోతు చాంప్ల(38) తండాలో వ్యవసాయంతోపాటు జాజిరెడ్డిగూడెం మండలం నాణ్యతండా ఆవాసం పూర్యతండా సమీపంలో గుట్టల వద్ద బొగ్గు బట్టీలు పెడుతూ జీవనం సాగిస్తున్నాడు.

ప్రేమించి పెళ్లి చేసుకొని..
బక్కహేమ్లాతండాకు చెందిన గుగులోతు చాంప్ల 12ఏళ్ల కిందట అదే తండాకు చెందిన క్లాస్‌మేట్‌ అరుణను ప్రేమించాడు. పెద్దలు అంగీకరించకపోయినా వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఇరు కుటుంబాల పెద్దలకు నచ్చజెప్పి సంసారం సాఫీగా చేస్తున్నారు. వీరికి ముగ్గురు సంతానం . కుమార్తెలు ఝాన్సీ, రోహిత, కుమారుడు ధనుష్‌ ఉన్నారు. ఇద్దరు కుమార్తెలు నకిరేకల్‌లోని గురుకుల పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారు. కుమారుడు తల్లిదండ్రులతో పాటే ఉంటున్నాడు.

గొంతు నులిమి.. కాలు, చేయి విరగ్గొటి..
చాంప్ల ఆదివారం రాత్రి భార్య, కుమారుడితో కలసి ద్విచక్రవాహనంపై తన స్వగ్రామం బక్కహేమ్లాతండా నుంచి పూర్యతండాలోని బొగ్గుబట్టీల వద్దకు వచ్చాడు. కాపలాగా భార్యాకుమారుడు ఒక మంచంలో, చాంప్ల మరో మంచంలో నిద్రించారు. సోమవారం ఉదయం వరకు అందరూ నిద్రపోయి ఉండగా సమీపంలోని తండాకు చెందిన వారు వచ్చి వారిని లేపే క్రమంలో చాంప్ల విగతజీవిగా పడి ఉన్నాడు. దీంతో వారు కేకలు వేస్తూ తండా గిరిజనులకు సమాచారం ఇచ్చారు. అర్ధరాత్రి దాటిన తర్వాత దుండగులు అక్కడికి వచ్చి మంచంలో నిద్రిస్తున్న చాంప్లపై దాడి చేయడంతో కాలు, చేయి విరిగిపోయిన ఆనవాళ్లు ఉన్నాయి. అనంతరం అతడి గొంతు నులిమి హత్య చేసినట్లు తెలుస్తోంది. అరుణ బోరున విలపిస్తూ తన భర్తని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చంపి పోయారని పేర్కొంటోంది.

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడన్న కారణంతోనే కోడలు అరుణ తన ప్రియుడు, మరికొందరి సహకారంతో కుమారుడిని హత్య చేయించిందని చాంప్ల తల్లి గుగులోతు జక్కి ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంఘటనా స్థలాన్ని నాగారం సీఐ శివశంకర్‌, స్థానిక ఎస్‌ఐ బి.అంజిరెడ్డి పరిశీలించారు. సూర్యాపేట నుంచి డాగ్‌స్క్వాడ్‌ను తీసుకువచ్చి ఆధారాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తుంగతుర్తి ఆస్పత్రికి తరలించారు.

అమ్మా.. నాన్నను చంపుతున్నారు
అమ్మా.. నాన్నను చంపుతున్నారు.. అంటూ ఏడ్చినా తల్లి పట్టించుకోకుండా నువ్వు పడుకో అని చెప్పిందని హతుడు చాంప్ల ఏడేళ్ల కుమారుడు ధనుష్‌ గిరిజనుల వద్ద వీడియోలో చెప్పిన మాటలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. చాంప్ల హత్యతో బక్కహేమ్లాతండా, పూర్యతండాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. బక్కహేమ్లాతండాకు చెందిన గిరిజనులు పెద్ద సంఖ్యలో సంఘటనాస్థలికి తరలివచ్చారు. తండాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని, పోస్టుమార్టం నివేదిక అనంతరం పూర్తి వివరాలు వెల్లడవుతాయని నాగారం సీఐ శివశంకర్‌ తెలిపారు. హతుడి తల్లి ఫిర్యాదుతో పాటు ఏడేళ్ల కుమారుడు ధనుష్‌ వీడియో ఆధారంగా పోలీసులు అరుణను అనుమానిస్తూ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement