నేరస్తుల పనిపడతాయ్..
నల్లగొండ : జిల్లా పోలీసు విభాగానికి రెండు పేలుడు పదార్థాలను గుర్తించే స్నిఫర్ (బిట్టు, చింటూ) శునకాలు, నేరస్తుల జాడను పసిగట్టే ఒక ట్రాకర్ (సోను) శునకం నూతనంగా చేరినట్లు ఎస్పీ శరత్‌చంద్ర పవార్ తెలిపారు. శిక్షణ పూర్తిచేసుకున్న అనంతరం డాగ్ హ్యాండ్లర్లు (కానిస్టేబుళ్లు) ఫకృద్దీన్, సతీష్, దుర్గాప్రసాద్ గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీని కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. శునకాలు హైదరాబాద్ సమీపంలోని మొయినాబాద్‌లో గల పోలీస్ డాగ్ ట్రైనింగ్ సెంటర్, (ఐఐటీఏ)లో ఎనిమిది నెలలపాటు ప్రత్యేక శిక్షణను పూర్తి చేసుకున్నాయన్నారు. పేలుడు పదార్థాలు (ఎక్స్‌ప్లోజివ్స్) గుర్తింపు, అనుమానాస్పద వస్తువుల తనిఖీ, నేరస్తుల అడుగుజాడల గుర్తింపు, గందరగోళ పరిస్థితుల్లో విధి నిర్వహణ వంటి అంశాలలో శునకాలకు శిక్షణ ఇచ్చారన్నారు. దొంగతనాలు, హత్య కేసుల విచారణలో ట్రాకర్ శునకం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. వీఐపీల పర్యటనలు, భారీ ప్రజాసభలు, ఉత్సవాలు, ప్రభుత్వ కార్యక్రమాలు, ఎన్నికల సమయంలో ముందస్తుగా తనిఖీలు నిర్వహించడంలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తాయని తెలిపారు. అనుమానాస్పద బ్యాగులు, వాహనాలు, భవనాల ప్రాంగణాలలో ఎక్స్‌ప్లోజివ్స్ గుర్తింపులో ఇవి ప్రత్యేక నైపుణ్యం కలిగి ఉన్నాయని వివరించారు. నూతనంగా చేరిన ఈ శునకాలతో జిల్లా పోలీసు విభాగం మరింత అప్రమత్తంగా, సమర్థవంతంగా సేవలు అందిస్తుందన్నారు. ప్రజలు కూడా పోలీసులకు సహకరించి అనుమానాస్పద విషయాలను వెంటనే సమీప పోలీసు అధికారులకు తెలియజేయాలని కోరారు.
ఫ నూతనంగా మూడు స్నిఫర్, ట్రాకర్ శునకాలు
ఫ భద్రతా విభాగానికి మరింత బలం చేకూరిందన్న జిల్లా ఎస్పీ
నేరస్తుల పనిపడతాయ్..


