సన్నాల బోనస్ రూ.71.47 కోట్లు
ఫ రైతుల ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం
నల్లగొండ అగ్రికల్చర్ : వానాకాలం సీజన్‌కు సంబంధించిన సన్నాల బోనస్ రూ.71.47 కోట్లు రైతుల ఖాతాల్లో ప్రభుత్వం గురువారం జమ చేసింది. ఐదు నెలలుగా రైతులు సన్నాల బోనస్ కోసం నిరీక్షిస్తున్న విషయం తెలిసిందే. సన్నాల సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్వింటాకు మద్దతు ధరతోపాటు అదనంగా రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించింది. వానాకాలం సీజన్‌కు సబంధించి జిల్లా వ్యాప్తంగా 31,416 మంది రైతుల నుంచి 1.48 లక్షల మెట్రిక్ టన్నుల సన్న ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరిచింది. ఇందుకుగాను రూ.355.18 కోట్లు చెల్లించింది. అందులో బోనస్ కింద క్వింటాకు రూ.500 చొప్పున రూ.74.33 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే ప్రభుత్వం 1,42,942 మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించి 30,262 మంది రైతుల ఖాతాల్లో రూ.71.47 కోట్ల బోనస్‌ను జమ చేసింది. ఇంకా 5,732 మెట్రిక్ టన్నులకు గాను 1,154 మంది రైతులకు రూ.2.86 కోట్ల బోనస్ డబ్బులు జమ చేయాల్సి ఉంది. ఎట్టకేలకు బోనస్ డబ్బులు ఖాతాల్లో జమ కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో తనిఖీలు
మునుగోడు : మండలంలోని రత్తిపల్లి, కల్వలపల్లి ప్రభుత్వ పాఠశాలల్లో గురువారం జిల్లా స్థాయి అకడమిక్ బృందం సభ్యులు తనిఖీలు నిర్వహించారు. ఆయా పాఠశాలల పరిసరాలతో పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపాధ్యాయుల బోధనా తీరును పరిశీలించారు. సులువుగా పాఠాలు అర్థమయ్యేలా ఉపాధ్యాయులెవరైనా వినూత్నంగా బోధన చేస్తున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ తనిఖీల్లో జిల్లా నోడల్ అధికారి టి.వెంకటరత్నం, బి.జైపాల్, ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు నర్సిరెడ్డి, గోనె మోహన్‌రావు, ఉపాధ్యాయులు ఆయేషా, సల్లానా, లక్ష్మీప్రసాద్, సీఆర్‌పీ నాగరాజు పాల్గొన్నారు.
22న గురుకుల ప్రవేశ పరీక్ష
నకిరేకల్ : గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతిలో ప్రవేశానికి వీటీజీ సెట్–26 పరీక్ష ఈ నెల 22న ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ గురుకుల విద్యాలయాల జిల్లా సమన్వయకర్త జె.శోభారాణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లావ్యాప్తంగా 33 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. మొత్తం 12,600 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. పరీక్ష రాసే విద్యార్థులు తమ హాల్ టికెట్, ధ్రువీకరణ పత్రాలతో ఒక గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకుకోవాలని సూచించారు.
లింగ నిర్ధారణ.. చట్ట విరుద్దం
నల్లగొండ టౌన్: గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ చేయడం చట్ట విరుద్ధమని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన శిక్షలు తప్పవని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) పుట్ల శ్రీనివాస్ అన్నారు. గురువారం నల్లగొండలోని తన చాంబర్‌లో పీసీఅండ్ పీఎన్‌డీటీ చట్టం–1994, నియమాలు–1996 అమలుపై నిర్వహించిన జిల్లా సలహా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఆడపిల్లల జననాల సంఖ్య తగ్గుదల వల్ల లింగ నిర్ధారణ, లింగ వివక్షను అరికట్టే ఈ చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేస్తామన్నారు. జిల్లాలో అల్ట్రాసౌండ్ స్కానింగ్ కేంద్రాలు.. చట్టంలోని నిబంధనలు కచ్చితంగా పాటించాలని, అవసరమైన రిజిస్ట్రేషన్ పత్రాలు, రికార్డులు సక్రమంగా నిర్వహించాలని సూచించారు. కొత్తగా దరఖాస్తు చేసిన అల్ట్రాసౌండ్ స్కానింగ్ కేంద్రాల ఫైళ్లను సమీక్షించి, చట్టబద్ధ అర్హతలు ఉన్న కేంద్రాలకు మాత్రమే ఆమోదం తెలపాలన్నారు. గర్భ నిరోధక మాత్రలు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ షాప్‌ల్లో విక్రయిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఈ చట్టంపై గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో జిల్లా క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, ప్రభుత్వ గైనకాలజిస్ట్ కట్టాజ్యోతి, నల్లగొండ వైద్య నిపుణులు డాక్టర్ సుచరిత, గైనకాలజీస్ట్ దీప, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ కృష్ణకుమారి, ఎన్జీఓ గీత పాల్గొన్నారు.
.
సన్నాల బోనస్ రూ.71.47 కోట్లు


