Mission Bhagiratha Employee Suicide For Non-payment of Monthly Salary - Sakshi
Sakshi News home page

జీతం చాలడంలేదని లేఖ.. మిషన్‌ భగీరథ ఉద్యోగిని ఆత్మహత్య

Jul 15 2023 7:20 AM | Updated on Jul 15 2023 10:59 AM

Mission Bhagiratha employee suicide - Sakshi

నల్లగొండ క్రైం: నెల వారి జీతం సక్రమంగా ఇవ్వకపోవడంతోనే ఆర్థిక ఇబ్బందుల కారణంగా మిషన్‌ భగీరథ 35 ఎంఎల్‌డీలో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న సింగం పుష్పలత ఆత్మహత్య చేసుకుందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. గత 6నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని, ఇందులో అధికారుల నిర్లక్ష్యం ఉందన్నారు. ఈమేరకు నల్లగొండ ఎస్పీని కలిసి బాధిత కుటుంబానికి తగిన న్యాయం చేయాలని కోరారు.

పుష్పలత ఆత్మహత్యకు ముందు రాసిన సూసైడ్‌ నోట్‌ను వారికి అందజేశారు. పుష్పలత భర్త మహేష్‌ 10 నెలల క్రితం ఆత్మహత్య చేసుకోగా.. ఇప్పుడు భార్య ఆత్మహత్య చేసుకుందన్నారు. చిన్నారుల అనాథలుగా మారారన్నారు. కార్మికుల వేతనం రూ.19 వేలు ఇవ్వాల్సి ఉండగా రూ.9వేలు ఇవ్వడం అన్యామన్నారు. కార్మికుల పొట్ట కొడుతున్నప్పటికీ అధికారులు, మంత్రి, ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

హాలియా: మిషన్‌ భగీరథలో పనిచేస్తున్న ఓ కాంట్రాక్టు ఉద్యోగిని ఆర్థిక ఇబ్బందులతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన హాలియా మున్సిపాలిటీలోని సాయిప్రతాప్‌ నగర్‌లో గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. తిరుమలగిరి(సాగర్‌) మండలంలోని అల్వాల గ్రామానికి చెందిన సింగం పుష్పలత(26)కి చిన్నవయసులోనే తల్లిదండ్రులు చనిపోయారు. మేనమామ అయిన జోలం సాంబయ్య ఆమెను పెంచి పెద్దచేశాడు. పుష్పలతను ఎనిమిదేళ్ల క్రితం నల్లగొండలోని పానగల్‌కు చెందిన సింగం మహేష్‌కి ఇచ్చి వివాహం జరిపించాడు.

మహేష్‌ పానగల్‌లోని మిషన్‌ భగీరథలో కాంట్రాక్టు పద్ధతిలో కంట్రోల్‌ రూం ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. వీరికి కుమార్తె సాన్విత, కుమారుడు సాయినందన్‌ ఉన్నారు. మహేష్‌కు వచ్చే జీతం సరిపోకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో గతేడాది ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త మృతి చెందడంతో పుష్పలతకు హాలియా మిషన్‌ భగీరథలో కాంట్రాక్టు ఉద్యోగిగా అవకాశం కల్పించారు. ఈమె 6 నెలల క్రితం హాలియా పట్టణంలోని సాయిప్రతాప్‌ నగర్‌లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ విధులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో గురువారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుంది.

ఇంటి యజమాని గమనించి బంధువులు, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండలోని ఏరియా ఆస్పత్రికి తరలించి, అనంతరం బంధువులకు అప్పగించారు. మృతురాలు మేనమామ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ క్రాంతికుమార్‌ తెలిపారు. కాగా.. ఏడాది క్రితం తండ్రి, ఇప్పుడు తల్లిని కోల్పోయి ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు.

చావుకు ఎవరూ కారణం కాదు.. 

సూసైడ్‌ నోట్‌లో ఇలా ఉంది..
పుష్పలత మృతదేహం సమీపంలో సూసైడ్‌ నోట్‌ కనిపించింది. అందులో తన చావుకు ఎవరూ కారణం కాదని, మిషన్‌ భగీరథలో చేసే ఉద్యోగానికి తనకు వచ్చే జీతం రూ. 9,500లు సరిపోకపోవడం, అది కూడా రెండు, మూడు నెలల వరకూ రాకపోవడంతో ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నానని పేర్కొని ఉంది. తన కడుపులో గడ్డ కావడంతో వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు ఆపరేషన్‌కు రూ. 2లక్షలు ఖర్చు అవుతుందనడంతో ఆర్థిక స్థోమత లేక ఆత్మహత్య చేసుకుంటున్నానని రాసి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement