‘భగీరథ’.. సమృద్ధి! | - | Sakshi
Sakshi News home page

‘భగీరథ’.. సమృద్ధి!

Oct 19 2026 1:13 AM | Updated on Oct 19 2026 1:13 AM

కొల్లాపూర్‌: త్వరలోనే మిషన్‌ భగీరథ స్కీంకు నీటి సరఫరా సమస్యలు శాశ్వతంగా తీరనున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాలకు భగీరథ స్కీం ద్వారా తాగునీటిని అందిస్తున్న విషయం తెలిసిందే. కొల్లాపూర్‌ మండలం ఎల్లూరు సమీపంలోని మిషన్‌ భగీరథ స్కీంకు ప్రస్తుతం ఎంజీకేఎల్‌ఐ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ఇక నుంచి పాలమూరు ప్రాజెక్టు ద్వారా నీటి సరఫరాకు ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. ఇందుకోసం నార్లాపూర్‌ రిజర్వాయర్‌కు అనుసంధానంగా పంప్‌హౌజ్‌ నిర్మించింది. ఈ పనులు దాదాపుగా తుదిదశకు చేరాయి. త్వరలోనే పంప్‌హౌజ్‌ను ప్రారంభించేందుకు సన్నాహకాలు చేస్తున్నారు.

తాగునీటి సరఫరా ఇలా..

కేఎల్‌ఐ ప్రాజెక్టుకు అనుసంధానంగా ఎల్లూరులో మిషన్‌ భగీరథ పంప్‌హౌజ్‌ నిర్మించారు. ఇక్కడి నుంచి ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాతో పాటు, రంగారెడ్డి జిల్లాలోని 3 నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 84 మండలాల్లోని 3,912 గ్రామాల ప్రజలకు తాగునీరు అందించేందుకు పైప్‌లైన్లు, వాటర్‌ట్యాంకులు నిర్మించారు.

శాశ్వత పరిష్కారం దిశగా..

మిషన్‌ భగీరథ స్కీంకు వేసవిలో నీటి సరఫరాకు ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో గత ప్రభుత్వం ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని భావించింది. మిషన్‌ భగీరథ స్కీంకు సమీపంలోనే పాలమూరు ప్రాజెక్టు పరిధిలోని నార్లాపూర్‌ రిజర్వాయర్‌ కూడా ఉంది. కేఎల్‌ఐ పరిధిలోని ఎల్లూరు రిజర్వాయర్‌ నీటినిల్వ సామర్థ్యం 0.36 టీఎంసీ కాగా.. నార్లాపూర్‌ రిజర్వాయర్‌ సామర్థ్యం 6.4 టీఎంసీలు. దీంతో నార్లాపూర్‌ రిజర్వాయర్‌ ద్వారా మిషన్‌ భగీరథ స్కీంకు నీటిని మళ్లించాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రెండు ప్రత్యామ్నాయాలను సిద్దం చేసింది. మొదటగా నార్లాపూర్‌ రిజర్వాయర్‌ పూర్తి నీటి నిల్వతో ఉన్నప్పుడు ఎలాంటి పంపింగ్‌ లేకుండా స్లూయిస్‌ ద్వారా ఎల్లూరు రిజర్వాయర్‌లోకి నీటిని మళ్లించేలా ఏర్పాట్లు చేశారు. నార్లాపూర్‌ రిజర్వాయర్‌లో ఫుల్‌గేజ్‌ నీటి నిల్వ లేని సమయంలో కూడా మిషన్‌ భగీరథకు నీటిని తరలించేందుకు వీలుగా సున్నపుతండా వద్ద పంప్‌హౌజ్‌ నిర్మాణానికి చర్యలు చేపట్టారు. ఇందుకోసం రూ. 140కోట్లు కేటాయించింది. పంప్‌హౌజ్‌ నిర్మాణం నిదానంగా సాగుతూ.. ఇన్నాళ్లకు తుదిదశకు చేరింది.

తాగునీటి పథకానికి పాలమూరు ప్రాజెక్టు నుంచి నీటి సరఫరాకు సిద్ధం

ఎల్లూరు సమీపంలోని సున్నపుతండాలో రూ.140కోట్లతోపంప్‌హౌజ్‌ నిర్మాణం

1.7 కేవీ సామర్థ్యంతో 6 మోటార్లు ఏర్పాటు

సీఎం చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహకాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement