మన్ననూర్: అమ్రాబాద్ మండలం వటువర్లపల్లి గ్రామస్తులు స్వచ్ఛందంగా పునరావాసం కోరుకుంటున్నారని డీఎఫ్ఓ రేవంత్ చంద్ర అన్నారు. ఆదివారం అటవీశాఖ ఆధ్వర్యంలో గ్రామస్తులతో నిర్వహించిన సమావేశంలో 240 కుటుంబాలు పునరావాసానికి సిద్ధంగా ఉన్నామని ఎంఓయూ చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎఫ్ఓ మాట్లాడుతూ.. అటవీశాఖ అధికారులు, సిబ్బంది గ్రామస్తులను బెదిరింపులకు పాల్పడుతున్నారని వస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. ఎలాంటి బలవంతం లేకుండా స్వచ్ఛందంగా పునరావాసం కోరుకునే వారికి మాత్రమే ప్రభుత్వం తరఫున కల్పించే సహకారం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఎఫ్డీఓ చంద్ర ప్రకాశ్ సింఘాల్, ఎంపీడీఓ రామన్న, ఎప్ఆర్ఓలు వీరేష్, ఈశ్వర్, పునరావాసం కమిటీ అధ్యక్షుడు సాయిబాబు, ఉపసర్పంచ్ బాల్రాజ్ పాల్గొన్నారు.
మోకాళ్లపై కూర్చొని ఉద్యోగుల నిరసన
కందనూలు: జాతీయ ఆరోగ్య మిషన్ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం జిల్లా కేంద్రంలో చేపట్టిన నిరవధిక సమ్మె ఆదివారం ఆరో రోజుకు చేరింది. జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఉద్యోగులు మోకాళ్లపై కూర్చొని నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఏళ్లుగా ఆరోగ్యశాఖలో విధులు నిర్వహిస్తూ, ప్రజలకు సేవలందిస్తున్న ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం సరైంది కాదన్నారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించడంతో పాటు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బాలకృష్ణ, జనరల్ సెక్రటరీ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గౌస్ బాషా పాల్గొన్నారు.
ఉపాధ్యాయుల
సమస్యలను పరిష్కరించాలి
కందనూలు: పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని ఎస్టీయూ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు పర్వత్రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎస్టీయూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఇచ్చిన మాట ప్రకారం హెల్త్ కార్డులు, పీఆర్సీ, తదితర అంశాలపై దృష్టి సారించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శ్రీధర్రావు, ప్రధాన కార్యదర్శి మధుసూదన్రెడ్డి రమేష్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.


