కల్వకుర్తి టౌన్/ పెద్దకొత్తపల్లి: కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి తన శాఖ నుంచి అవసరమైన పూర్తి సహకారం అందిస్తానని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగ, వృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. శుక్రవారం రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లురవి, కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ రత్నమాలతో కలిసి మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన గాంధీజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం మంత్రి అడ్లూరి మాట్లాడుతూ ఎస్సీ సంక్షేమ శాఖ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ప్రతిపాదనలు అందజేస్తే బడ్జెట్‌లో నిధులు కేటాయించేలా చూస్తానని, ఇందుకోసం పట్టణంతోపాటు నియోజకవర్గంలోని అవసరాలను గుర్తించి ప్రాధాన్యతా క్రమంలో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. మహాత్మగాంధీ చూపిన సత్యం, అహింస, సేవా మార్గాలు సమాజానికి ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని అభిప్రాయపడ్డారు. మంత్రి జూపల్లి కృష్ణారావుతో మాట్లాడుతూ కల్వకుర్తి పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. పర్యాటక అభివృద్ధి శాఖ ద్వారా రూ.కోటి నిధులతో ఆడిటోరియం నిర్మాణానికి మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. పట్టణానికి అవసరమైన మౌలిక వసతులపై సమగ్ర ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని చెప్పారు. అలాగే పెద్దకొత్తపల్లిలో ఏర్పాటు చేసిన మహాత్మ జ్యోతిరావు పూలే, మహేంద్రనాథ్ విగ్రహాలను మంత్రులు జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, ఎమ్మెల్యే వంశీకృష్ణ, ప్రొఫెసర్ కాశీం ఆవిష్కరించి నివాళులర్పించారు.
అవకాశాలను సద్వినియోగం చేసుకోండి..
ఎంపీ మల్లురవి మాట్లాడుతూ కల్వకుర్తి పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పట్టణానికి అవసరమైన అభివద్ధి పనులకు తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ కల్వకుర్తి అభివృద్ధికి మంత్రులు జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్ ఇచ్చిన హామీలు కీలకం అన్నారు. కల్వకుర్తి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా స్పందించి అభివృద్ధి పనులకు హామీలు ఇచ్చిన మంత్రులకు, సహకరిస్తున్న ఎంపీ, కలెక్టర్, మున్సిపల్ పాలకవర్గానికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పట్టణంలోని పాలమూరు చౌరస్తాలో రూ.50 లక్షలతో ఏర్పాటు చేయనున్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి భూమిపూజ చేశారు. అలాగే మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన వార్డు కార్యాలయాలను మంత్రులు ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ షానవాజ్‌ఖాన్, మున్సిపల్ కమిషనర్ మహమూద్ షేక్ తదితరులు పాల్గొన్నారు.
ప్రాధాన్యత క్రమంలో
ప్రతిపాదనలు పంపించండి
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగ,
వృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి
అడ్లూరి లక్ష్మణ్
మున్సిపాలిటీలో ఆడిటోరియం
నిర్మాణానికి రూ.కోటి నిధులు : మంత్రి జూపల్లి


