నాగర్‌కర్నూల్: జాతిపిత మహాత్మగాంధీ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని ఏఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో గాంధీజీ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మగాంధీ పాటించిన అహింస, సత్యం, శాంతి మార్గాలు నేటి సమాజానికి, పోలీస్ వ్యవస్థకు ఎంతో మార్గదర్శకం అన్నారు. గాంధీజీ ఆశయాలను ప్రతిఒక్కరూ తమ జీవితంలో అలవరుచుకోవాలని, సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజాసేవకు పోలీసులు నిబద్ధతతో కృషి చేయడమే గాంధీజీకి మనం ఇచ్చే నిజమైన నివాళి అన్నారు. కార్యక్రమంలో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ జగన్, ఎస్‌ఐలు రమేష్, శ్రీనివాస్, ఆర్‌ఎస్‌ఐలు ప్రశాంత్, గౌస్‌పాషా, శివాజీ పాల్గొన్నారు.
వెదురు వస్తువుల
తయారీపై శిక్షణ
మన్ననూర్: వెదురుతో ఆకర్శనీయమైన పరికరాలు, వస్తువులు తయారు చేయడంలో పరిజ్ఞానం కలిగి ఉన్న ఆదివాసీ చెంచులు, మేదరులను ప్రోత్సహించేందుకు మాతృభూమి సంస్థ ముందుకు వచ్చిందని సంస్థ అధ్యక్షుడు ప్యారసాని రమాకాంత్ అన్నారు. శుక్రవారం గాంధీ జయంతిని పురస్కరించుకొని అప్పాపూర్‌లో గ్రామసభ నిర్వహించారు. అనంతరం సర్పంచ్ శివమ్మతో కలిసి నల్లమల అటవీ లోతట్టు ప్రాంతంలోని అప్పాపూర్, భౌరాపూర్, ఈర్లపెంట, మేడిమల్కల, సంఘిడి గుండాలు చెంచు పెంటలలో పర్యటించి చెంచుల జీవన విధానం తదితర అంశాల గురించి చర్చించారు. వెదురుతో వస్తువులు తయారు చేసేందుకు 1,500 మంది మేదరులు, చెంచులకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహంతో శిక్షణ ఇప్పించడం జరుగుతుందన్నారు. గతంలో విద్యుత్ సౌకర్యం లేని చెంచు పెంటలు, గూడేలలో సోలార్ లైట్లు అందజేయడం జరిగిందన్నారు. వచ్చే దసరా పండగకు రూ.10 లక్షల వ్యయంతో 100 సోలార్ వీధిలైట్లను ఆయా పెంటలలో అమర్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. కార్యక్రమంలో ఆదివాసీ జాగృతి ఫౌండేషన్ అధ్యక్షుడు చింతల భాస్కర్, చెంచు లోకం జిల్లా కార్యదర్శి గురువయ్య, చెంచు నాయకులు వెంకటయ్య, బయ్యన్న, నాగన్న, మహేష్, వాల్‌సింగ్, రవి, నీలాద్రి, వివేక్ వర్ధన్ పాల్గొన్నారు.


