తండ్రి
చనిపోయినా.. కూలి పనులు చేసి
కల్వకుర్తి రూరల్: కూతురు 13 ఏళ్ల వయస్సులోనే తండ్రి చనిపోయినా.. ఆ తల్లి ఎంతో కష్టపడి కూతుర్ని ఉన్నత చదువులు చదివిస్తోంది. వెల్దండకు చెందిన అలివేలు తన కూతురు సరిత 13 ఏళ్ల వయస్సులోనే భర్త మృతిచెందాడు. దీంతో తల్లి ఎంతో కష్టపడి.. కూలి పనులు చేసి కూతుర్ని చదివిస్తుంది. తల్లి పడుతున్న కష్టాలను కళ్లారా చూసిన సరిత బాగా చదువుకొని మహబూబాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించింది. ఎంబీబీఎస్ కోచింగ్ లాంగ్ టర్మ్ తీసుకున్నప్పుడు రూ.1.50 లక్షలు కావాల్సిన సమయంలో చదువు సైతం మానేయాలని అనుకున్నప్పటికీ తల్లి కష్టం గుర్తుకువచ్చి ఆ ఆలోచనను విరమించుకుని అనుకున్న లక్ష్యం వైపు ముందుకు సాగింది. వీరు ఉండడానికి ఇల్లు సైతం లేకపోవడంతో రేకుల ఇంట్లోనే ఉంటూ కాలం వెళ్లదీస్తున్నారు. అయితే వైద్య విద్య కోసం ఆర్థిక ఇబ్బందులు తలెత్తిన సందర్భంలో ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి ముందుకు వచ్చి రూ.లక్ష ఆర్థిక సాయం అందించారు.
అచ్చంపేట రూరల్: కూతుళ్లు అనే బేధం చూడని ఆ తండ్రి వ్యవసాయం చేస్తూ.. మరోవైపు నిత్యం ఆటో నడిపించి ఎంబీబీఎస్ చదివిస్తూ స్ఫూర్తిగా నిలిచాడు. అచ్చంపేట మండలంలోని అంకిరోనిపల్లి గ్రామానికి చెందిన పాత్లావత్ గోపినాథ్, విజయపద్మ దంపతుల ఇద్దరు కుమార్తెలు. తండ్రి 18 ఏళ్లుగా ఆటో నడుపుతూ, వ్యవసాయం చేసుకుంటూ ఇద్దరు కుమార్తెలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివించారు. పెద్ద కూతురు జానకిప్రియ 2025 రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మెడికల్ కళాశాలలో మొదటి సంవత్సరం పూర్తి చేసింది. అలాగే రెండో కుమార్తె దేవిప్రియ ఈ ఏడాది వనపర్తి మెడికల్ కళాశాలలో సీటు సాధించింది. ఒకే కుటుంబంలో ఇద్దరు గిరిజన విద్యార్థినులు ఎంబీబీఎస్ సీటు సాధించడంతో ఆ కుటుంబంలో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తాను పడిన కష్టం.. తన కూతుళ్లను ప్రయోజకులను చేసిందని గోపినాథ్ ఆనందం వ్యక్తం చేశారు. కుమారుడు, కూతురు అనే తారతమ్యం లేకండా.. కూతుళ్లనే కొడుకుగా భావించి చదివిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.


