కోడేరు: మండలంలో రైతుల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును రైతులు కోరారు. శనివారం రాజాపూర్‌లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి జూపల్లి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఎల్‌నినో కారణంగా వర్షాలు లేక పంటలు పండే పరిస్థితి కనిపించడం లేదని, కేఎల్‌ఐ డీ–8 కాల్వ ద్వారా చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలని కోరారు. దీంతో మంత్రి రైతుల ముందే సంబంధిత నీటి పారుదల శాఖ అధికారులతో మాట్లాడి చివరి ఆయకట్టు వరకు నీటిని విడుదల చేయాలని ఆదేశించారు. అలాగే విద్యుత్ స్తంభాలు లేక కట్టెలపై రైతులు విద్యుత్ వైర్లు ఏర్పాటు చేసుకొని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే విద్యుత్ అధికారులు స్తంభాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. సబ్సిడీ స్ప్రింక్లర్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఆన్‌లైన్‌లో రాజాపూర్ గ్రామం కనిపించడం లేదని మంత్రి దృష్టికి తెచ్చారు. గతంలో స్ప్రింక్లర్ల దరఖాస్తు చేసుకున్నా ఇప్పటి వరకు అందించలేదని ఆరోపించారు. దీంతో మంత్రి మాట్లాడుతూ రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు ఆయా శాఖల అధికారులతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు సాంబశివుడు, ఉపసర్పంచ్ సిరాజ్, నాయకులు బాలయ్య, కుర్మయ్య, బాలచంద్రి, వెంకయ్య, విష్ణు, కురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.


