● 14 ఏళ్ల కూతురి మరణాన్ని
జీర్ణించుకోలేక
గుడి నిర్మించిన తండ్రి
● నిత్యం దీపం వెలిగిస్తూ.. జ్ఞాపకాల నెమరు
పాపను ప్రాణంలా పెంచాం. చివరికి విధి పాపను దూరం చేసింది. అయినా పాప జ్ఞాపకాలను మరిచిపోలేకపోతున్నాం. పాప మా కళ్లెదుటే ఉండాలని గుడి కట్టాం. గుడిలో ఆమె ప్రతిమ, ఫొటో పుట్టిన రోజు, చనిపోయిన తేదీలలో ప్రత్యేకంగా పూజలు చేస్తున్నాం. గుర్తొచ్చినప్పుడల్లా గుడి వద్దకు వెళ్లి కాసేపు అక్కడే కూర్చొని ఆమె జ్ఞాపకాలను నెమరేసుకుంటాం. – రమేష్, గీతిక తండ్రి
అచ్చంపేట రూరల్: అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు ఒక్కసారిగా అనారోగ్యంతో మృతిచెందింది. 14 ఏళ్ల ప్రాయంలో తమ కంటిపాప కనుమరుగైపోవడాన్ని ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. భౌతికంగా దూరమైన కూతురి కోసం.. కోవెల నిర్మించి పూజలు చేస్తూ.. జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు.
పాపంటే ప్రాణం..
కొల్లాపూర్ మండలంలోని చుక్కాయిపల్లి గ్రామానికి చెందిన మద్దరి రమేష్ అచ్చంపేట సివిల్ కోర్టు కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. రమేష్, వరలక్ష్మి దంపతులకు 2009లో వివాహం కాగా.. వారికి ముగ్గురు సంతానం. వీరిలో మొదటి కూతురు గీతిక 2011 జూలై 17న జన్మించింది. అయితే కాన్పు సమయంలో వైద్యుడి తప్పిదం వల్ల బ్రెయిన్ డ్యామేజ్ అయ్యింది. మొదటి సంతానం కావడం.. ఆ దంపతులకు కూతురంటే అమిత ప్రేమ ఉండేది. ఎన్ని ఇబ్బందులున్నా ఆస్పత్రిలో చికిత్స చేయిస్తూ పాపను కాపాడుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. అలా 14 ఏళ్ల వయస్సులో 2024 అక్టోబర్ 21న పాప గీతిక చనిపోయింది.
అపురూపంగా, అల్లారుముద్దుగా పెంచుకున్న పాప ఇకపై కళ్ల ముందు లేదని ఎంతో బాధపడ్డారు. ఆమె ఫొటోను చూస్తూ కుమిలిపోయేవారు. కనిపించకుండా పోయిన కూతురు కళ్ల ముందే ఉండాలనే తపనతో.. తమ సొంత గ్రామంలో ఉన్న స్థలంలో పాప జ్ఞాపకాలతో గుడి కట్టి.. పాప ప్రతిమను పెట్టారు. దేవతలను పూజించిన మాదిరిగానే గుర్తుకు వచ్చినప్పుడల్లా ఆ కోవెల వద్దకు వెళ్లి దీపం పెడతారు. ఆ దీపం ప్రతిరోజు వెలిగేలా చూస్తున్నారు. ప్రస్తుతం ఆ దంపతులకు ఒక పాప, కుమారుడు ఉండగా.. కూతురిపై మమకారం పోగొట్టుకోలేకపోతున్నారు. ప్రతిరోజు, ప్రతిక్షణం పాపనే తలుచుకుంటూ బాధపడుతున్నారు.


