సాక్షి, నాగర్‌కర్నూల్: జిల్లాలో ఈసారి వేసవికాలంలో వీబీ జీ రామ్‌జీ (ఉపాధి హామీ) పనులు ఊపందుకున్నాయి. గడిచిన మూడు నెలల కాలంలోనే జిల్లావ్యాప్తంగా ఉపాధి కూలీలకు 10,59,663 పనిదినాలు కల్పించారు. సగటున రోజుకు 40 వేలకుపైగా కూలీలు పనులకు హాజరవుతుండటం గమనార్హం. మరోవైపు ఉపాధి హామీ పథకంలో అవకతవకలను అరికట్టేందుకు నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ (ఎన్‌ఎంఎంఎస్) అమలు చేస్తుండగా.. ఫేషియల్ రికగ్నిషన్ హాజరు విధానంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయినప్పటికీ గతేడాదికి మించి ఈసారి ఉపాధి హామీ పనులకు హాజరవుతున్న కూలీల సంఖ్య పెరిగింది.
68 శాతం లక్ష్యం పూర్తి..
జిల్లాలో ఉపాధి హామీ పనులకు హాజరవుతున్న కూలీల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గతేడాదితో పోల్చితే ఈసారి పనిదినాల్లో పెరుగుదల కనిపిస్తోంది. ఈసారి జిల్లావ్యాప్తంగా మొత్తం 16 లక్షల పనిదినాలను కల్పించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటి వరకు 10.60 లక్షల పనిదినాలను కూలీలకు కల్పించారు. మొత్తంగా 68 శాతం వరకు లక్ష్యాన్ని పూర్తిచేశారు. ఇంకా మిగతా రోజుల్లోనూ పనిదినాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
సకాలంలో అందని కూలి..
జిల్లాలో ఉపాధి హామీ పథకం కూలీల హాజరు నమోదు పెరుగుతుండగా.. కూలీలకు డబ్బుల చెల్లింపులో మాత్రం తీవ్ర జాప్యం కొనసాగుతోంది. వారాలు గడిచినా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ కాకపోవడంతో కూలీలు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. కేంద్రం గత నెల నుంచి ఉపాధి హామీ పనులకు నిధులు విడుదల చేయడం లేదు. దీంతో ఉపాధి కూలీలకు చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోతున్నాయి. జిల్లాలోని 20 మండలాల పరిధిలో మొత్తం 1,91,768 జాబ్‌కా ర్డులు ఉండగా, వీరిలో 97,565 మంది కూలీలు పనులకు హాజరవుతున్నాయి. ఇందులో సుమారు 40 నుంచి 43 వేల మంది వరకు నిత్యం పనులకు వస్తున్నారు. వీరికి రోజువారీ కూలి కనీసం రూ.250– 307 వరకు చెల్లించాల్సి ఉండగా.. జిల్లాలో సగటున రూ.274 వరకు అందుతోంది. అయితే పనులు పూర్తిచేసి నాలుగు, ఐదు వారాలు గడిచినా డబ్బులు రాకపోవడంతో కూలీలు నిరాశకు గురవుతున్నారు. ప్రభుత్వం కనీసం రెండు వారాలకు ఒకసారి డబ్బులు జమచేయాలని కూలీలు కోరుతున్నారు.
పనులకు హాజరవుతున్నవారు 97,565
సగటున నిత్యం
వస్తున్నవారు
40,45 వేలు
ఈ ఏడాది పనిదినాల లక్ష్యం 16 లక్షలు
జిల్లాలో సగటు దినసరి
వేతనం రూ.279
10.60 లక్షలు
మే నెలలో అత్యధికంగాపనిదినాలు కల్పించిన అధికారులు
ఈసారి వేసవిలో పెరిగిన కూలీల హాజరు
ఎన్‌ఎంఎంఎస్ యాప్ హాజరు అమలుతో ఇబ్బందులు
ఐదు వారాలు దాటినా డబ్బులు రాక నిరాశ
మొత్తం జాబ్‌కార్డులు
1,91,768
ఉపాధి
కూలీలు
1,55,554


