కొల్లాపూర్: దివ్యాంగుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య వెల్లడించారు. మంగళవారం కొల్లాపూర్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా అనర్హులకు పింఛన్ల తొలగింపు ప్రక్రియ జరుగుతోందని, దాని తర్వాత పింఛన్లను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. దివ్యాంగులకు నెలకు రూ.6 వేల పింఛన్ త్వరలోనే రాబోతుందన్నారు. దివ్యాంగులకు పింఛన్లు ఇచ్చే పథకాన్ని మొదట ప్రారంభించింది.. దివ్యాంగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుచేసింది కాంగ్రెస్ పార్టీనే అని గుర్తుచేశారు. బీఆర్‌ఎస్, బీజేపీలు దివ్యాంగులకు చేసిందేమీ లేదని విమర్శించారు. ఇందిరమ్మ ఇళ్ల కమిటీల్లో దివ్యాంగులకు స్థానం కల్పించాలని, 5 శాతం ఇళ్లు దివ్యాంగులకు కేటాయించాలని, కొల్లాపూర్ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌లో రిజర్వేషన్ ప్రాతిపదికన దుకాణాలు కేటాయించేలా చూడాలని స్థానిక దివ్యాంగుల సంఘం నాయకులు వీరయ్యకు విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ వైస్‌చైర్మన్ రహీంపాష మాట్లాడుతూ మున్సిపల్ దుకాణాల్లో దివ్యాంగులకు కూడా ప్రత్యేక కోటా కల్పించేందుకు పాలకవర్గ సభ్యులతో చర్చించి తీర్మానం చేస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు హరీష్‌కుమార్, రాజేందర్, ఆశన్న, రాజశేఖర్ పాల్గొన్నారు.


