పెట్టుబడి కాలం.. తప్పని ఆర్థిక భారం | - | Sakshi
Sakshi News home page

పెట్టుబడి కాలం.. తప్పని ఆర్థిక భారం

Jun 16 2026 1:22 AM | Updated on Jun 16 2026 1:22 AM

అచ్చంపేట: జూన్‌ రాగానే చాలా కుటుంబాల నెలవారీ బడ్జెట్‌ గాడి తప్పుతుంది. వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో విద్యార్థులకు సంబంధించిన ఖర్చులు మీదపడుతుండగా.. మరోవైపు వానాకాలం నేపథ్యంలో రైతులు పంటల సాగుకు సంబంధించి.. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల కొనుగోళ్లకు అప్పులు చేయాల్సి వస్తోంది. దీంతో పట్టణాలు, గ్రామాలు తేడా లేకుండా ప్రతి కుటుంబంపై ఆర్థిక భారం పెరుగుతోంది. ఈ రెండూ రూ.వేలకు వేలు ఖర్చుతో కూడుకున్నవే కావడంతో ఆర్థిక పరిస్థితులు తలకిందులవుతున్నాయని ఇటు సామాన్య ప్రజలు, అటు అన్నదాతలు వాపోతున్నారు.

విద్యార్థుల ఖర్చులే అధికం..

పాఠశాలలు, కళాశాలలు ప్రారంభం కావడంతో అడ్మిషన్‌ ఫీజులు, పుస్తకాలు, నోట్‌బుక్స్‌, యూనిఫాంలు, షూస్‌, బ్యాగులు ఇలా అన్నీ మళ్లీ కొనాల్సిందే. వీటి కోసం తరగతులను బట్టి రూ.వేల నుంచి రూ.లక్షలు వెచ్చించాల్సి వస్తోంది. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న కుటుంబాల్లో ఈ భారం మరింత అధికంగా ఉంటోంది. పుస్తకాలు, నోట్‌బుక్స్‌, బ్యాగులు, యూనిఫాంలకే కనీసం ఒక్కొక్కరికి కనీసం రూ.10 వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇవి కాకుండా మొదటి టర్మ్‌ ఫీజులూ అదనం. ఒకవేళ బడిని మార్చి.. కొత్త స్కూల్‌కు పంపిస్తే మళ్లీ అక్కడ అడ్మిషన్‌ ఫీజు చెల్లించాల్సి పరిస్థితి దాపురిస్తోంది.

రైతులకు రెండింతలు..

వర్షాకాలం ప్రారంభం కావడంతోనే పొల్లాల్లో సాగు పనులు మొదలవుతాయి. ఇందుకు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, ట్రాక్టర్ల అద్దె, కూలీల ఖర్చులు ఒకేసారి రావడంతో రైతులపై ఆర్థిక ఒత్తిడి పెరుగుతోంది. యాసంగి పంటలను ఇప్పుడిప్పుడే అమ్మేస్తున్నారు. ఇంకా జిల్లాలో కొన్ని గ్రామాల్లో ధాన్యం, మొక్కజొన్న మిగిలే ఉన్నాయి. వీటి డబ్బులు చేతికొచ్చే వరకు ఎదురుచూసే పరిస్థితి ఉండదు. ఇటు సాగు పనులు, అటు పిల్లల చదువులకు అంటే.. తప్పని పరిస్థితుల్లో అప్పులు చేయాల్సి వస్తోంది.

విద్యార్థుల ఫీజులు

వ్యవసాయ

పెట్టుబడి

అదనపు భారం..

జూన్‌లో ప్రారంభయ్యే వర్షాకాలం సీజన్‌లో పిల్లల చదువులు, సాగు పనులే కాదు.. ఇళ్ల మరమ్మతు, పైకప్పుల లీకేజీల నివారణ, రెయిన్‌ కోట్లు, గొడుగులు, వర్షాకాలానికి అవసరమైన ఇతర వస్తువులు కొనుగోళ్లు ఉంటాయి. మరోవైపు కూరగాయలు, పా లు, గ్యాస్‌, విద్యుత్‌ బిల్లులు, పెట్రోల్‌, డీజి ల్‌, రవాణా ఖర్చులు వంటి నిత్యావసర వ్య యాలు పెరుగుతున్నాయి. ఇవన్నీ కుటుంబ బడ్జెట్‌ను ప్రభావితం చేస్తున్నాయి.

ఒకవైపు పాఠశాలలు ప్రారంభం.. మరోవైపు వానాకాలం పనులు

విద్యార్థుల కోసం పేదల ‘బడ్జెట్‌’ తిప్పలు

ఎరువులు, విత్తనాల కోసం రైతన్నల పాట్లు

సామాన్యుల ఆర్థిక స్థితిని తలకిందులు చేస్తున్న జూన్‌ మాసం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement