కందనూలు: ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవసహాయంతో కలిసి ప్రజల నుంచి 68 వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యత అధికారులపై ఉందన్నారు. కార్యక్రమంలో ఏఓ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
పోలీస్ గ్రీవెన్స్‌కు 9..
కందనూలు: ప్రజలు నిర్భంయంగా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా నేరుగా తమ సమస్యలపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎస్పీ సంగ్రామ్ సింగ్‌జీ పాటిల్ అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ సెల్‌లో బాధితుల నుంచి ఎస్పీ 9 ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో 5 భూమికి సంబంధించినవి, 4 తగు న్యాయం చేయాలని ఫిర్యాదు వచ్చినట్లు చెప్పారు. ఆయా ఫిర్యాదుల పరిష్కారం కోసం సంబంధిత స్టేషన్లకు పంపినట్లు ఎస్పీ పేర్కొన్నారు.
దివ్యాంగులకు అండగా ఉంటాం
కందనూలు: దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కృషిచేయడంతోపాటు వారికి అన్నివిధాలుగా అండగా ఉంటామని వికలాంగుల కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ ముత్తినేని వీరయ్య అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో వికలాంగుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రత్యేక గ్రీవెన్స్ ద్వారా వికలాంగులకు ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, మోటార్ వెహికిల్ తదితర వాటిని అందించడానికి సహకరిస్తానని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా వికలాంగుల సంఘం నాయకులు, దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ డీఎంకు షోకాజ్ నోటీసులు
కందనూలు: జిల్లాస్థాయి మీడియా అక్రిడేషన్ కమిటీ సమావేశానికి హాజరుకాకపోవడంతో నాగర్‌కర్నూల్ బస్ డిపో మేనేజర్ యాదయ్యపై కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులను సోమవారం ఆదేశించారు. విధి నిర్వహణలో బాధ్యతగా ఉండాలని, నిర్లక్ష్య ధోరణితో ఉండకూడదని సూచించారు.
భారీ ఈదురుగాలులకు రైస్ మిల్లు ధ్వంసం
● మిల్లులో నిల్వ ఉంచిన ధాన్యం నీటిపాలు
● దాదాపు రూ.8కోట్ల మేర నష్టం
నాగర్‌కర్నూల్ రూరల్: నాగర్‌కర్నూల్ జిల్లా గుడిపల్లిలో భారీ ఈదురుగాలులకు శ్రీ సీతారామాంజనేయ ఇండస్ట్రీస్ రైస్ మిల్లు ధ్వంసమైంది. యజమానులు బిల్లకంటి రాజ్యలక్ష్మి, రవికుమార్ కథనం ప్రకారం.. సోమవారం 5 గంటల ప్రాంతంలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఈ క్రమంలో ఒక్కసారిగా సుడిగాలి చుట్టుకోవడంతో రైస్ మిల్లుపై భాగంలోని కప్పు, ఇతర యంత్రాలకు సంబంధించిన భారీ పైపులతోపాటు మిషనరీ, రైస్ మిల్లు షెడ్డు కుప్పకూలిపోయింది. దీంతో పాటు రైస్ మిల్లులో ప్రాసెసింగ్‌లో ఉన్న వడ్లు, బియ్యం వర్షానికి తడిసి ముద్దయింది. దాదాపు రూ.8 కోట్ల వరకు ఆస్తినష్టం వాటిల్లిందని మిల్లు యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. భారీ సుడిగాలితో కూడిన వర్షం రైస్ మిల్లును చుట్టుముట్టిన సమయంలో నిర్వాహకులు వెంటనే కార్మికులను అప్రమత్తం చేసి ఒక చోటికి చేర్చడంతో ప్రాణాపాయం తప్పింది.


