ధాన్యం తరలింపులో జాప్యం చేయొద్దు | - | Sakshi
Sakshi News home page

ధాన్యం తరలింపులో జాప్యం చేయొద్దు

Jun 15 2026 1:11 AM | Updated on Jun 15 2026 1:11 AM

ఉప్పునుంతల: వర్షాలు కురుస్తున్నందున కొనుగోలు కేంద్రాల్లోని వరిధాన్యాన్ని వెంటనే మిల్లులకు చేర్చాలని.. ధాన్యం తరలింపులో ఎలాంటి జాప్యం చేయొద్దని కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ అధికారులను ఆదేశించారు. ఆదివారం ఉప్పునుంతల మండలం లక్ష్మాపూర్‌, పెద్దాపూర్‌ గ్రామాల్లో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రాల్లో ధాన్యం నిల్వలు, తేమ శాతం, తూకం ప్రక్రియ, హమాలీలు, రవాణా, రైతులకు అందిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కేంద్రాల్లోని ధాన్యం పరిస్థితిని స్వయంగా చూసిన కలెక్టర్‌.. తడిసిన బస్తాలను వెంటనే సమీపంలో ఉన్న బాయిల్డ్‌ రైస్‌ మిల్లులకు తరలించాలని నిర్వాహకులకు సూచించారు. ధాన్యం తరలించడానికి అవసరమైన రవాణా ఏర్పాట్లను వేగవంతం చేయాలని సివిల్‌ సప్లయ్‌, ఐకేపీ, మెప్మా అధికారులను ఆదేశించారు. వర్షాలకు ధాన్యం నాణ్యత దెబ్బతినకుండా అవసరమైన టార్ఫాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. అనంతరం కలెక్టర్‌ రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించడంలో ఆలస్యం చేయడంతోనే వర్షానికి ధాన్యం తడిసిపోయి నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. అయితే రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన వివరించారు. ఈ నెల 17 వరకు వర్షాలు ఉన్నందున రైతులు ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకురాకుండా, పంట పొలాల్లోనే జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు. కాగా, గతేడాది యూరియా కోసం పడిన ఇబ్బందులను రైతులు కలెక్టర్‌ దృష్టికి తీసుకురాగా.. ఈ ఏడాది ప్రణాళిక ప్రకారం జిల్లాకు అవసరమున్న యూరియా సకాలంలో రైతులకు అందించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆన్‌లైన్‌ విధానంలో యూరియా పంపిణీ పక్కాగా జరిగేలా వ్యవసాయశాఖ ద్వారా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని వివరించారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను సకాలంలో అందేలా చూస్తామన్నారు. రైతులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. కలెక్టర్‌ వెంట జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి నర్సింహారావు, తహసీల్దార్‌ సునీత, డీటీ రమేశ్‌, ఏఓ కొర్ర రమేశ్‌, పీఏసీఎస్‌ సీఈఓ రవీందర్‌రావు, ఐకేపీ ఏపీఎం బాలచంద్రుడు, నాయకులు అనంతరెడ్డి, రవీందర్‌రావు ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement