కల్వకుర్తి రూరల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తూ.. కార్మికుల హక్కులను కాలరాస్తోందని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు భాషమోని ఆంజనేయులు ఆరోపించారు. ఆదివారం పట్టణంలోని సీఐటీయూ కార్యాలయంలో అంగన్‌వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు మాసమ్మ అధ్యక్షతన నిర్వహించిన తాలూకాస్థాయి సీఐటీయూ అనుబంధ రంగాల ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను కేంద్రం రద్దుచేసి.. తీరని అన్యాయం చేసిందన్నారు. ఆశావర్కర్లు, అంగన్‌వాడీ, ఐకేపీ, మధ్యాహ్న భోజన తదితర రంగాల కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వకుండా వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారని విమర్శించారు. పెట్రోల్, డీజిల్, నిత్యావసర ధరలను పెంచి సామాన్య ప్రజలపై భారం మోపారన్నారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను ప్రతిఘటించేందుకు అందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి మహబూబ్‌గర్ జిల్లాలో ఈ నెల 20, 21, 22 తేదీల్లో వ్యవసాయ కార్మిక సంఘం నాలుగో రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా 20న నిర్వహించే బహిరంగ సభకు కార్మికులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో శివరాములు, ఆంజనేయులు, ఏపీ మల్లయ్య, పద్మ, రాజు, యాదయ్య, దేవయ్య, అలివేల, రఫీకా సుల్తానా, రాఘవేందర్, రామార్జున్ తదితరులు ఉన్నారు.


