నిధులున్నా.. నత్తనడకే! | - | Sakshi
Sakshi News home page

నిధులున్నా.. నత్తనడకే!

Jun 13 2026 1:41 PM | Updated on Jun 13 2026 1:41 PM

రైల్వే పనులతోనే ఆలస్యం..

రైల్వే అధికారులు వంతెన నిర్మాణం చేపట్టడంతో పైప్‌లైన్‌ పనుల్లో జాప్యం జరుగుతోంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు విన్నవించాం. వంతెన పనులు పూర్తయిన వెంటనే పైప్‌లైన్‌ ఏర్పాటు ప్రారంభించి సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తాం.

– వరప్రసాద్‌,

ఏఈ, రామన్‌పాడ్‌ జలాశయం

అగ్రిమెంట్‌ పూర్తి కాలేదు..

అమరచింత ఎత్తిపోతల సెక్షన్‌ పైపుల ఏర్పాటుకు రూ.46 లక్షలు మంజూరయ్యాయి. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్‌ అగ్రిమెంట్‌ చేసుకోవాల్సి ఉంది. అగ్రిమెంట్‌ పూర్తయిన 15 రోజుల్లో సెక్షన్‌ పైపుల ఏర్పాటు పూర్తి చేస్తాం. – వంశీకృష్ణ,

ఏఈఈ అమరచింత ఎత్తిపోతల పథకం

అమరచింత/మదనాపురం: జిల్లాలోని సరళాసాగర్‌ ప్రధాన పైప్‌లైన్‌, అమరచింత ఎత్తిపోతల పథకానికి సంబంధించి సెక్షన్‌ పైపుల ఏర్పాటులో జాప్యం కారణంగా వానాకాలం పంటల సాగుపై ఆయకట్టు రైతుల్లో ఆందోళన నెలకొంది. సరళాసాగర్‌ కింద 3,200 ఎకరాలు, అమరచింత ఎత్తిపోతల కింద 2,200 ఆయకట్టు ఉంది. మరమ్మతుల కారణంగా పూర్తి ఆయకట్టుకు సమృద్ధిగా సాగునీరు అందని పరిస్థితులు నెలకొన్నాయి. యాసంగి సీజన్‌లో క్రాప్‌ హాలిడే ప్రకటించడంతో సాగుకు దూరంగా ఉన్న ఆయకట్టు రైతులు వానాకాలం పంటల సాగు కోసం ఇప్పటికే పొలాలను దుక్కిదున్ని చదును చేసి సిద్ధంగా ఉంచారు. కానీ ఎత్తిపోతల పథకాల మరమ్మతులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా పనులు పూర్తిగాకపోవడంతో వానాకాలం పూర్తి ఆయకట్టుకు నీరందని పరిస్థితి నెలకొంది. సరళాసాగర్‌ పైప్‌లైన్‌ నిర్మాణానికిగాను రూ.49.50 లక్షలు, అమరచింత ఎత్తిపోతల సెక్షన్‌ పైప్‌ల ఏర్పాటుకు రూ.46 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసింది. ఆయా పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా మరమ్మతులు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని ఆయకట్టు రైతుల్లో ఆందోళన నెలకొంది.

అమరచింత ఎత్తిపోతల..

అమరచింత ఎత్తిపోతల పథకాన్ని 1999–2000 సంవత్సరంలో ప్రారంభించారు. ఎత్తిపోతల ఆయకట్టు 2,200 ఎకరాలు ఉండగా.. ప్రస్తుతం వెయ్యి ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతుండటంతో రైతులు వరి, పత్తి, చెరుకు సాగు చేస్తున్నారు. 24 ఏళ్లుగా సాగునీటిని పంపింగ్‌ చేస్తున్న సెక్షన్‌ పైపులు తుప్పు పడుతుండటంతో వీటిని మార్చేందుకు ప్రభుత్వం రూ.46 లక్షలు మంజూరు చేసింది. ఐదు సెక్షన్‌ పైపులను యుద్ధప్రాతిపదినక ఏర్పాటు చేసి వానాకాలంలో రైతులకు సాగునీరు అందించాల్సి ఉంది. ఇందుకు సంబంధించి టెండర్‌ ప్రక్రియ పూర్తయినా.. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్‌ అగ్రిమెంట్‌కు ముందుకు రాకపోవడంతో ఆలస్యమవుతుందని నీటిపారుదలశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. ఎత్తిపోతల ఆయకట్టు కింద మూలమళ్ల, మస్తీపురం, ఖానాపురం, సింగంపేట, అమరచింత, పాంరెడ్డిపల్లి గ్రామాలు ఉండగా.. 1,099 మంది రైతుల భాగస్వామ్యంతో ఎత్తిపోతల నిర్వహణ కొనసాగుతోంది. చిన్న చిన్న మరమ్మతులు తప్ప చెప్పుకోదగిన పనులు ఏవీ లేవని.. సెక్షన్‌ పైపులు మాత్రమే త్వరగా మార్చేస్తే సాగునీరు సకాలంలో రైతులకు అందించవచ్చని ఆయకట్టుదారుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు చెబుతున్నారు.

ముందుకుసాగని

ఎత్తిపోతల మరమ్మతు

సరళాసాగర్‌ ప్రధాన పైప్‌లైన్‌.. ‘అమరచింత’ సెక్షన్‌ పైపులఏర్పాటులో ఆలస్యం

మొదలైన వానాకాలం పంటల సాగు

పనులు పూర్తయితేనే ఆయకట్టుకు నీటి విడుదల

సరళాసాగర్‌లో ఇలా..

సరళాసాగర్‌ జలాశయం కింద 9 గ్రామాల పరిధిలో 3,200 ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో వరి నారు పోసుకోవడానికి రైతులు సిద్ధమవుతున్నారు. మదనాపురం సమీపంలోని ఊకచెట్టు వాగు వద్ద రెండో రైల్వే వంతెన నిర్మాణ పనులు కొనసాగుతుండగా రామన్‌పాడు వెనుక జలాల నుంచి సరళాసాగర్‌ ప్రాజెక్టుకు నీటిని తరలించే ప్రధాన పైప్‌లైన్‌ను తొలగించాల్సి వచ్చింది. దీంతో సరళాసాగర్‌ ప్రాజెక్టుకు సాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. సమస్యను గుర్తించిన ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి పైప్‌లైన్‌ పనులు త్వరగా పూర్తి చేయాలని నీటిపారుదలశాఖ అధికారులను ఆదేశించడంతో పాటు రూ.49.50 లక్షలు మంజూరు చేశారు. కాంట్రాక్టర్‌, అధికారుల నిర్లక్ష్యంతో ఇప్పటికీ పైప్‌లైన్‌ ఏర్పాటు పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇప్పటికిప్పుడు పనులు వేగవంతం చేసినా మరో 15 రోజుల సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. సమయం దాటిపోతే ఈ ఏడాది వానాకాలం పంటలకు నీరందడం కష్టమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement