నాగర్‌కర్నూల్ రూరల్: మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి పెండింగ్‌లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని, జీఓ 51 సవరించి గ్రీన్ చానల్ ద్వారా వేతనాలు అకౌంట్లో జమ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డీపీఓ శ్రీరామ్‌కు అందజేశారు. ఈ సందర్భంగా పంచాయతీ యూనియన్ నాయకులు ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట్రంలో 60 వేల మంది పంచాయతీ కార్మికులు పనిచేస్తున్నారని, గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దుతూ ఎలాంటి అంటువ్యాధులు, అనారోగ్యాలు రాకుండా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న వీరిపట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. పారిశుద్ధ్య కార్మికులు ఏళ్ల తరబడి పనిచేసినా ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, ఈఎస్‌ఐ, పీఎఫ్, ప్రమాద బీమా వంటి సంక్షేమ పథకాలకు నోచుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకసారి ప్రజాప్రతినిధిగా ఎన్నికై తే జీవితకాలం పెన్షన్ తీసుకుంటూ రాజకీయ నాయకులు ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు. కార్మికులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయకుంటే నిరవధిక సమ్మె చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు రామయ్య, శంకర్‌నాయక్, కాశన్న, నాగరాజు, వెంకటేశ్వర్లు, లింగస్వామి, పరశురాములు, రామకృష్ణ, హుస్సేన్, బాలస్వామి, భిక్షపతి, యాదయ్య, వెంకటమ్మ, లింగమ్మ, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.
విద్య, వైద్యరంగాలపరిరక్షణకు ఉద్యమాలు
పాన్‌గల్: పేదలకు ప్రభుత్వ విద్య, వైద్యరంగాలు ప్రాథమిక హక్కులని.. వాటి పరిరక్షణకు రాష్ట్రవ్యాప్తంగా దశల వారీగా ఉద్యమాలు చేపట్టనున్నట్లు కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) రాష్ట్ర ప్రధానకార్యదర్శి తప్పెట్ల స్కైలాబ్‌బాబు తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలో సంఘం జిల్లా అధ్యక్షుడు గంధం భగత్ అధ్యక్షతన జరిగిన జిల్లా సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్య అనేది సామాజిక అభివృద్ధికి మూలస్తంభమని.. గ్రామీణ పేదలు, దళితులు, బడుగు బలహీనవర్గాల పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలే ఆశా కిరణాలన్నారు. రాష్ట్రంలో 12 వేల ప్రభుత్వ పాఠశాలలు మూసివేసి మండల కేంద్రాల్లో 4 వేల పాఠశాలలు నెలకొల్పాలని సీఎం స్వయంగా ప్రకటించడం ఆందోళన కలిగిస్తున్నాయని.. ప్రభుత్వ ప్రయత్నాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. పేద కుటుంబాలకు నాణ్యమైన విద్య అందకపోతే సామాజిక అసమానతలు మరింత పెరిగే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యసిబ్బంది, మందులు, పరికరాల కొరత నెలకొందని.. పేదలకు ఉచిత నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.


