లింగాల: సమాజంలో బాలకార్మిక వ్యవస్థ అనేది పేరుకుపోయిందని, దీని నిర్మూలనకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి శ్రీశైలంగౌడు అన్నారు. మండలంలోని రాంపూర్‌లో శుక్రవారం యాక్సెస్ టు జస్టిస్, కోనేరు సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 18 ఏళ్లలోపు పిల్లలను పనుల్లో పెట్టుకోవడం నేరమని, అలా ఎవరైనా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అదేవిధంగా లైంగిక వేధింపులకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవన్నారు. ముఖ్యంగా హోటళ్లు, మోటారు మెకానిక్ పాయింట్లు, కిరాణం దుకాణాలు ఇతరత్రా వ్యాపార కేంద్రాలలో బాలకార్మికులు అధికంగా ఉంటారని, అలాంటి ప్రదేశాల్లో బాల, బాలికలు పనులు చేస్తుంటే నిర్మూలించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఉప సర్పంచు కృష్ణయ్య, పంచాయతీ కార్యదర్శి పాండునాయక్, మాజీ సర్పంచు సుధీర్‌గౌడు, జిల్లా మహిళా సాధికారిత కేంద్రం కోఆర్డినేటర్ సునీత, కోనేరు సంస్థ ఏరియా కోఆర్డినేటర్ జాకీర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.


