నాగర్‌కర్నూల్‌కు పీజీ కళాశాల | - | Sakshi
Sakshi News home page

నాగర్‌కర్నూల్‌కు పీజీ కళాశాల

Jun 12 2026 6:09 AM | Updated on Jun 12 2026 6:09 AM

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: ఉమ్మడి జిల్లాలో విద్యార్థులకు ఉన్నత విద్యను అందించేందుకు పాాలమూరు యూనివర్సిటీ తన పరిధిని విస్తరిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు గద్వాల, వనపర్తి, కొల్లాపూర్‌లో పీజీ సెంటర్లు ఏర్పాటు చేసిన యూనివర్సిటీ తాజాగా నాగర్‌కర్నూల్‌ జిల్లాకేంద్రంలోనూ పీజీ కళాశాల ఏర్పాటుకు చర్యలు చేపడుతోంది. స్థానిక ప్రజాప్రతినిధుల విజ్ఞప్తుల మేరకు అక్కడి పీజీ కళాశాల ఏర్పాటుపై యూనివర్సిటీ అధికారులు ప్రతిపాదలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. దీంతో మొదటి దశలో కీలకమైన కళాశాల ఏర్పాటుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి ఆమోదం తెలపగా.. ఫైనాన్స్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి క్లియరెన్స్‌ వస్తే ప్రభుత్వం త్వరలో జీఓ విడుదల చేసే అవకాశం ఉంది.

వనపర్తి పీజీ కళాశాలకు..

వనపర్తిలో పీజీ కళాశాల ప్రారంభించాక భవనం మాత్రమే నిర్మించిన అధికారులు.. బాల, బాలికలకు హాస్టళ్లు ఇప్పటికీ నిర్మించలేదు. దీంతో విద్యార్థులు అడ్మిషన్లు తీసుకునే సంఖ్య ప్రతి సంవత్సరం గణనీయంగా తగ్గుతూ వస్తుంది. దీంతో అధికారులు హాస్టల్స్‌ నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా కళాశాల ప్రాంగణంలో ఉన్న కొంత భూమిలో బాలికల హాస్టల్‌ నిర్మించనుండగా.. బాలుర హాస్టల్‌ కోసం స్థలం లేకపోవడంతో కలెక్టర్‌తో పాటు స్థానిక ఎమ్మెల్యేకు వీసీ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో విన్నవించగా 35 గుంటల భూమిని కేటాయిస్తూ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు.

మొదట 5 కోర్సులతో..

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో కళాశాల ఏర్పాటు ప్రతిపాదనల్లో భాగంగా మొదట భూమికి సంబంధించి 2 ఎకరాలు కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఈ రెండు ఎకరాల భూమిని యూనివర్సిటీ పీజీ కళాశాలకు అధికారులు కేటాయించనున్నారు. ఇందులో పీజీ కళాశాల భవనం, బాల, బాలికల హాస్టళ్లు నిర్మించనున్నారు. దీంతోపాటు మొత్తం 5 కోర్సులతో కళాశాల ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇందులో ఎంబీఏ, ఎంసీఏ, ఎమ్మెస్సీ కంప్యూటర్స్‌, ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, ఎంఏ సైకాలజీ వంటి కోర్సులు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి సబ్జెక్టులో కూడా సుమారు 40 మంది చొప్పున మొత్తం 200 మంది విద్యార్థులకు అడ్మిషన్లు కల్పిస్తారు.

ప్రజాప్రతినిధుల వినతి మేరకు ప్రభుత్వానికి పాలమూరు యూనివర్సిటీ ప్రతిపాదనలు

ఆమోదం తెలిపిన తెలంగాణ ఉన్నత విద్యామండలి

5 కోర్సులతో ఏర్పాటుకు త్వరలో చర్యలు

2 ఎకరాల భూమి కేటాయించే అవకాశం

వనపర్తి పీజీ కళాశాలలో హాస్టల్స్‌ నిర్మాణానికి భూమి కేటాయింపు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement