రుణ ప్రణాళిక ఖరారు | - | Sakshi
Sakshi News home page

రుణ ప్రణాళిక ఖరారు

Jun 11 2026 8:11 AM | Updated on Jun 11 2026 8:11 AM

బ్యాంకులు కీలకపాత్ర పోషించాలి : కలెక్టర్‌

236మందికి విద్యా రుణాలు..

2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.9,768 కోట్లు

–8లో u

జిల్లా ఆర్థికాభివృద్ధి వేగవంతం కావాలంటే బ్యాంకులు కీలక పాత్ర పోషించాలని.. వ్యవసాయం, పారిశ్రామిక రంగం, మహిళా సంఘాలు, ఇతర ప్రాధాన్యతా రంగాలకు విస్తృత స్థాయిలో రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ బ్యాంకర్లను ఆదేశించారు. వ్యవసాయ రంగం జిల్లా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటిదని.. రైతులు వ్యవసాయ అవసరాలకు సకాలంలో రుణాలు పొందేలా బ్యాంకులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. రైతులకు పంట రుణాలు, వ్యవసాయ అనుబంధ రంగాలైన పాడి పరిశ్రమ, గొర్రెల పెంపకం, మత్స్య పరిశ్రమ తదితర రంగాలకు అవసరమైన ఆర్థిక సహకారం అందించాలని కోరారు. అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని గ్రామీణ ప్రాంత ప్రజలకు బ్యాంకింగ్‌ రంగంలో మెరుగైన సేవలు అందించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన రుణ లక్ష్యాలను సాధించడమే కాకుండా వాటిని అధిగమించే దిశగా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని బ్యాంకర్లకు సూచించారు.

కందనూలు: జిల్లా సమగ్ర ఆర్థికాభివృద్ధికి దిశానిర్దేశం చేసే 2026–27 వార్షిక రుణ ప్రణాళిక ఖరారైంది. బుధవారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ అధ్యక్షతన జరిగిన డిస్ట్రిక్ట్‌ కన్సల్టేటివ్‌ కమిటీ సమావేశంలో రుణ ప్రణాళికను రూపొందించారు. మొత్తం 2,77,772 ఖాతాదారులకు వివిధ రంగాల్లో రూ.9,768 కోట్లతో రుణాలు అందించాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ మొత్తంలో ప్రాధాన్య రంగాలకు 88.42 శాతం వాటా కేటాయించగా.. ప్రాధాన్యేతర రంగాలకు 11.58 శాతం కేటాయింపులు చేశారు. జిల్లా లీడ్‌ బ్యాంక్‌ ఆధ్వర్యంలో రూపొందించిన సమగ్ర క్రెడిట్‌ ప్లాన్‌ ద్వారా వ్యవసాయం, సూక్ష్మ–చిన్న–మధ్యతరహా పరిశ్రమలు, గృహ నిర్మాణం, విద్య, పునరుత్పాదక ఇంధనం, సామాజిక మౌలిక వసతుల అభివృద్ధికి అవసరమైన రుణాలు విస్తృతంగా అందనున్నాయి.

వ్యవసాయ రంగానికి రూ.8,637 కోట్లు..

జిల్లా ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయరంగం కీలక పాత్ర పోషిస్తోంది. రుణ ప్రణాళికలో ఈ రంగానికి అత్యధిక ప్రాధాన్యం కల్పించారు. మొత్తం వ్యవసాయరంగ రుణలక్ష్యాన్ని రూ.8,637 కోట్లుగా నిర్ణయించారు. పంటల సాగు, ఉత్పత్తి, వ్యవసాయ యాంత్రీకరణ, సాగునీటి వసతులు, వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధికి రుణాలు అందించనున్నారు. అదే విధంగా వ్యవసాయ టర్మ్‌ లోన్లు, మౌలిక వసతుల అభివృద్ధి కోసం రూ.6,870 కోట్లు కేటాయించారు. ఫార్మ్‌ క్రెడిట్‌ కింద రూ. 2,310.07కోట్లు అందించనున్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలైన పశుపోషణ, పాల ఉత్పత్తి, గొర్రెల పెంపకం, కోళ్ల పరిశ్రమ, మత్స్య పరిశ్రమ, ఉద్యానవన పంటల అభివృద్ధికి రూ.129.81 కోట్లు కేటాయించారు. అదనంగా ఇతర వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాల కోసం రూ.174.24 కోట్లు మంజూరు చేయనున్నారు.

పారిశ్రామిక వృద్ధిపై ప్రత్యేక దృష్టి..

జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగానికి రూ.1,014 కోట్ల రుణ లక్ష్యాన్ని నిర్ణయించారు. యువ పారిశ్రామికవేత్తలు, స్వయం ఉపాధి యూనిట్లు, చిన్న వ్యాపార సంస్థలు, గ్రామీణ పరిశ్రమలకు అవసరమైన మూలధనాన్ని అందించడంపై ప్రత్యేక దృష్టి సారించారు. చిన్న పరిశ్రమలకు రూ.249.86 కోట్లు, మధ్యతరహా పరిశ్రమలకు రూ.260 కోట్లు కేటాయించారు. గ్రామీణ ప్రాంతాల్లో కొత్త పరిశ్రమల స్థాపన, స్థానిక వనరుల ఆధారంగా ఉపాధి అవకాశాల సృష్టి, మహిళా పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సహకారం అందించడం ద్వారా జిల్లాలో పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఉన్నత విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించేందుకు రూ. 37.90 కోట్లు కేటాయించారు. ఈ నిధుల ద్వారా 236 మంది విద్యార్థులకు రుణ సదుపాయం లభించనుంది. ఉన్నత విద్య, వృత్తిపరమైన కోర్సులు, సాంకేతిక విద్య అభ్యసించే విద్యార్థులకు ఇది ఉపయోగపడనుంది. సొంతింటి కలను సాకారం చేసుకునే కుటుంబాలకు గృహ రుణాల రూపంలో రూ.316.25 కోట్లు కేటాయించారు. మధ్య, దిగువ తరగతి కుటుంబాలకు గృహనిర్మాణం, గృహ విస్తరణ, గృహ కొనుగోలు అవసరాలకు ఈ రుణాలు తోడ్పడనున్నాయి. సామాజిక మౌలిక వసతులు – పునరుత్పాదక ఇంధనానికి మద్దతు, జిల్లాలో సామాజిక మౌలిక వసతుల అభివృద్ధికి రూ.10 కోట్లు కేటాయించారు. పునరుత్పాదక ఇంధన రంగానికి రూ.5.11 కోట్లు కేటాయించారు. ప్రాధాన్యేతర రంగానికి మొత్తం రూ.1,131 కోట్ల రుణ లక్ష్యాన్ని నిర్ణయించారు.

2,77,772 ఖాతాదారులకు

రుణ సదుపాయం

ప్రాధాన్య రంగాలకు 88.42 శాతం వాటా కేటాయింపు

డిస్ట్రిక్ట్‌ కన్సల్టేటివ్‌ కమిటీ సమావేశంలో రుణ లక్ష్యం నిర్దేశం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement