ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలి

Jun 11 2026 8:11 AM | Updated on Jun 11 2026 8:11 AM

కందనూలు: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలని కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో డీఈఓ, ఎంఈఓలు, స్కూల్‌ కాంప్లెక్స్‌ హెచ్‌ఎంలతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఈ నెల 15న విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా విద్యార్థులు ఉత్సాహంగా పాఠశాలలకు హాజరయ్యేలా అన్ని స్కూళ్లను పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని సూచించారు. పాఠశాలల ప్రారంభం నుంచి 15 రోజులపాటు విద్యార్థుల హాజరుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. బడిబయటి పిల్లలను పాఠశాలల్లో చేర్చుకునే విధంగా కృషి చేయాలని తెలిపారు. ఈ విషయంలో విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజాప్రతినిధుల సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపుతో పాటు విద్యార్థుల హాజరు శాతం మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని.. ప్రతి విద్యార్థి విద్యా పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్‌ ఆదేశించారు. ప్రభుత్వం అమలుచేస్తున్న విద్యా సంస్కరణలు, సంక్షేమ కార్యక్రమాల ఫలితాలు విద్యార్థులకు పూర్తిస్థాయిలో అందేలా చూడాలన్నారు. సమావేశంలో డీఈఓ రమేశ్‌కుమార్‌, ఇంటర్మీడియట్‌ నోడల్‌ అధికారి వెంకటరమణ, నోడల్‌ అధికారి కుర్మయ్య, సెక్టోరియల్‌ అధికారులు కిరణ్‌ కుమార్‌, వెంకటయ్య, నూరుద్దీన్‌ ఉన్నారు.

జిల్లా కేంద్రంలోని ఈవీఎంల గోడౌన్‌ను రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా గోడౌన్‌లో భద్రపరిచిన ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు, బ్యాలెట్‌ యూనిట్లు, కంట్రోల్‌ యూనిట్లు, వీవీ ప్యాట్‌ యంత్రాలు ఇతర ఎన్నికల సామగ్రిని కలెక్టర్‌ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. భద్రతా ఏర్పాట్లు, రికార్డుల నిర్వహణ, సీల్‌ల పరిస్థితి తదితర అంశాలను సంబంధిత అధికారులతో తెలుసుకున్నారు. గోడౌన్‌ భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వొద్దని ఆయన సూచించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement