● జోగుళాంబ జోన్–7 డీఐజీ
ఎల్‌ఎస్ చౌహాన్
ఎర్రవల్లి: ప్రజల ప్రాణాల రక్షణ కోసమే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని చేపట్టిందని జోగుళాంబ జోన్–7 డీఐజీ ఎల్‌ఎస్ చౌహాన్ అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బుధవారం ఎర్రవల్లిలో సర్పంచ్ అనితా కృష్ణసాగర్ అధ్యక్షతన జరిగిన గ్రామ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ శ్రీనివాసరావు పుష్పగుచ్ఛం అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన అవగాహన వీడియోలను ప్రదర్శించారు. హెల్మెట్ లేకుండా, మద్యం తాగి వాహనాలను నడపడం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. అదే విధంగా రోడ్డు ప్రమాదాల్లో కుటుంబ సభ్యులను కోల్పోయిన వారి భావోద్వేగాలను ప్రత్యక్షంగా వినిపించారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా రోజు 70 నుంచి 80 వరకు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటుడగా.. 20 నుంచి 30 మంది వరకు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం ప్రజలు ట్రాఫిక్ నియమాలు పాటించకపోవడమేనని ఆయన స్పష్టం చేశారు. ప్రతి వ్యక్తి బాధ్యతగా వ్యవహరిస్తేనే ప్రమాదాలను పూర్తిగా నివారించవచ్చని అన్నారు. ద్విచక్ర వాహనంపై ప్రయాణించే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ఇద్దరికి మాత్రమే అనుమతించిన వాహనంపై ముగ్గురు లేదా నలుగురు ప్రయాణించడం ప్రమాదకరమని హెచ్చరించారు. డ్రంకెన్ డ్రైవ్, రాంగ్ రూట్ డ్రైవింగ్ వంటి అలవాట్లు ప్రాణాలకు తీవ్ర ముప్పును కలిగిస్తాయని ఆయన వివరించారు. అనంతరం ద్విచక్ర వాహనదారులకు స్వయంగా హెల్మెట్ ధరింపజేశారు. పదవ పటాలం కమాండెంట్ జయరాజు, డీటీఓ రాధిక, డీఎస్పీ మొగిలయ్య, సీఐ ప్రదీప్‌కుమార్ పాల్గొన్నారు.


