కందనూలు: రైతులకు నకిలీ, నాసిరకం విత్తనాలు విక్రయించే వ్యాపారులు, డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయ సమావేశ మందిరంలో ఎస్పీ డా.సంగ్రామ్ సింగ్‌జీ పాటిల్‌తో కలిసి విత్తన దుకాణాల పర్యవేక్షణ బృందాలు, రెవెన్యూ, పోలీసు, వ్యవసాయశాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. రైతులు తప్పనిసరిగా లైసెన్స్ కలిగిన విత్తన విక్రయ కేంద్రాల నుంచే విత్తనాలను కొనుగోలుచేయాలని సూచించారు. కొనుగోలు సమయంలో తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలన్నారు. భవిష్యత్‌లో ఏమైనా సమస్యలు తలెత్తినప్పుడు అవి ఆధారాలుగా ఉపయోగపడతాయని.. నకిలీ విత్తనాలతో నష్టపోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు సూచించారు. జిల్లాలో అనుమతులు లేకుండా విత్తనాలు విక్రయిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. డివిజన్ స్థాయిలో ఆర్డీఓ, డీఎస్పీ, వ్యవసాయ అధికారులతో, మండల స్థాయిలో సీఐ, ఎస్‌ఐ, తహసీల్దార్, మండల వ్యవసాయ అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసినట్లు తెలిపారు.


