కందనూలు: ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది మెడపై అడ్మిషన్ల కత్తి వేలాడుతోంది. ఈ విద్యా సంవత్సరం భారీగా అడ్మిషన్లు తేవాలంటూ యాజమాన్యాలు టీచర్లపై తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నాయి. అడ్మిషన్ల సంఖ్యను బట్టి సదరు సిబ్బందికి ఇంక్రిమెంట్ ఇవ్వాలా.. లేదా అనే అంశాన్ని ముడిపెడుతున్నారు. అడ్మిషన్ల సమయంలో యాజమాన్యాల ఒత్తిడి భరించలేక ప్రైవేటు టీచర్లు సతమతమవుతున్నారు.
ఉద్యోగ భద్రత కరువు..
భావిభారత పౌరులను తీర్చిదిద్దుతున్న ప్రైవేటు టీచర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పనిచేసేది పాఠశాలలోనైనా సెలవనే మాటే ఉండదు. రెండవ శనివారమైనా, ఆదివారమైనా పాఠశాల పనిలోనే నిమగ్నమై ఉండాలి. ఇక కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంటే చాలు సిబ్బంది గుండెల్లో రైళ్లు పరిగెడుతాయి. యాజమాన్యం చెప్పినన్ని అడ్మిషన్లు చేయించకపోతే ఉద్యోగం ఉంటుందో.. ఊడుతుందో తెలియదు. అందుకే వేసవి సెలవుల్లోనూ ఇంటింటికి తిరుగుతూ పిల్లలను తమ పాఠశాలల్లో చేర్పించాలని.. ఫీజులో రాయితీ కూడా ఇప్పిస్తామంటూ తల్లిదండ్రులను బతిమిలాడుతున్నారు.
5 నుంచి 25 టార్గెట్..
జిల్లాలో గతేడాది లెక్కల ప్రకారం 167 ప్రైవేటు స్కూళ్లు ఉన్నాయి. అందులో 47,739 మంది విద్యార్థులకు 2,436 మందికి పైగా బోధన, బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నారు. వీరు 5 నుంచి 25 అడ్మిషన్లు చేయాల్సిందేనని యాజామాన్యాలు టార్గెట్ పెట్టడంతో జిల్లాకేంద్రంతో పాటు మండల పరిసర గ్రామాల్లో మండుటెండను సైతం లెక్కచేయకుండా ఇంటింటికీ తిరుగుతున్నారు. విద్యార్థులకు మంచి బోధనతో పాటు ఐఐటీ, నీట్, మెడికాన్ కోచింగ్ ఇస్తామంటూ బ్రోచర్లతో తల్లిదండ్రులను ఆకట్టుకునే పనిలో పడ్డారు.
నిబంధనలకు విరుద్ధంగా..
జిల్లావ్యాప్తంగా 70శాతం ప్రైవేటు స్కూళ్లు నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ప్రతి ఏడాది పాఠశాలల అనుమతులను రెన్యూవల్ చేసుకోవడంతో పాటు పాఠశాల భవనం ఫైర్ సేఫ్టీ, క్వాలీఫైడ్ ఫ్యాకల్టీ తదితర అంశాలు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. కానీ అలాంటివేమీ లేకుండా కొన్ని ప్రైవేటు పాఠశాలలు నిర్వహిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
బ్రోచర్లతో ఇంటింటికీ..
ప్రైవేటు స్కూళ్లకు సంబంధించిన బ్రోచర్లతో బోధన, బోధనేతర సిబ్బంది ఇంటింటి బాట పట్టారు. ఉదయం నుంచి రాత్రి వరకు పల్లె, పట్టణం తేడా లేకుండా తిరుగుతున్నారు. తక్కువ ఫీజుతో మెరుగైన, సమర్థవంతమైన టీచర్లతో బోధన అందిస్తున్నామంటూ విసృత ప్రచారం చేస్తున్నారు. తమ విద్యాసంస్థల్లో పిల్లలను చేర్పిస్తే.. ఉన్నత చదువుతో పాటు ఐఐటీ, నీట్ కోచింగ్‌లు ఇస్తామంటూ తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నారు.
ప్రైవేటు టీచర్లకు యాజమాన్యాల టార్గెట్
పాఠశాలల్లో విద్యార్థులను చేర్పిస్తేనే జీతాల పెంపు
ఇబ్బందులు పడుతున్న బోధన, బోధనేతర సిబ్బంది
బ్రోచర్లతో ఇంటింటికీ తిరుగుతున్న వైనం
ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు..
జిల్లాలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. జిల్లా విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేపట్టి.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి. తీవ్రమైన ఎండలో ఉపాధ్యాయులను అడ్మిషన్ల పేరుతో కాలనీలు, గ్రామాల్లో తిప్పడం మానుకోవాలి. – బంగారుబాబు, ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు
చర్యలు తీసుకుంటాం..
ఉపాధ్యాయులకు టార్గెట్లు పెట్టి వేధించడం సరైంది కాదు. ఆ విధంగా ఏ పాఠశాలైనా చేస్తున్నట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలి.
– రమేశ్‌కుమార్, డీఈఓ


