వెల్దండ: మండల కేంద్రంలోని బుధార్‌పేట ఆంజనేయస్వామి ఆలయాన్ని ఆదివారం జిల్లా న్యాయమూర్తి రమాకాంత్ కుటుంబ సమేతంగా సందర్శించారు. ఆలయ అర్చకులు వారికి స్వాగతం పలికి.. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ న్యాయమూర్తిని శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు భరత్‌గౌడ్, సతీష్, పూజారి నాగులు పాల్గొన్నారు.
మైసమ్మ జాతరలో పెరిగిన భక్తుల రద్దీ
పెద్దకొత్తపల్లి: నాయినోనిపల్లి మైసమ్మ జాతరకు ఆదివారం భక్తులు పోటెత్తారు. సోమవారం మృగశిర కార్తె వస్తుండటం.. వానాకాలం సాగు పనులు, విద్యాసంస్థలు ప్రారంభించే సమయం ఆసన్నం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి మైసమ్మను దర్శించుకున్నారు. భక్తుల రద్దీతో జాతర మైదానం కిక్కిరిసింది. నాయినోనిపల్లి జాతర మైదానం నుంచి పెద్దకొత్తపల్లి వరకు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. 8 కి.మీ. దూరం ప్రయాణించేందుకు 2 గంటలకు పైగా సమయం పట్టడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. స్థానిక పోలీసులు పెద్దకొత్తపల్లి బస్టాండ్ వద్ద వాహనాల రాకపోకలను నియంత్రించడంతో ట్రాఫిక్ సమస్య తీరింది. కాగా, జాతరలో తాగునీటి కొరతతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. దాదాపు 15వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ సిబ్బంది తెలిపారు.
నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు
తాడూరు: రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయశాఖ అధికారి యశ్వంత్‌రావు హెచ్చరించారు. ఆదివారం తాడూరు మండలం ఇంద్రకల్‌లోని ఫర్టిలైజర్ దుకాణాల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా విత్తనాలు, ఎరువుల స్టాక్‌కు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. విత్తనాలు కొనుగోలుచేసే రైతులకు తప్పనిసరిగా రశీదులు ఇవ్వాలని డీలర్లకు సూచించారు. అధిక ధరలకు ఎరువులు, విత్తనాలు విక్రయించొద్దని సూచించారు. ఆయన వెంట సిబ్బంది ఉన్నారు.


