నీట్‌ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

నీట్‌ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

Jun 7 2026 9:06 AM | Updated on Jun 7 2026 9:06 AM

కందనూలు: రాష్ట్రంలో వరి కొనుగోలు, సంక్షేమ పథకాల అమలు పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. శనివారం హైదరాబాద్‌ నుంచి అదనపు డీజీపీ మహేష్‌ భగవత్‌, పౌరసరఫరాల కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర, ఇతర ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో నీట్‌ నిర్వహణ ఏర్పాట్లు, వరి ధాన్యం కొనుగోలు, జూన్‌ 9న సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో నిర్వహించనున్న సీఎం సభ అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 21న జరగనున్న నీట్‌–2026కు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రభుత్వ సంస్థలలో మాత్రమే పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయాలని, సీసీ కెమెరాలు బిగించాలని చెప్పారు. అలాగే అంతర్జాతీయ యోగా దినోత్సవం దృష్ట్యా పరీక్ష నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. పరీక్ష రోజు ప్రశ్నపత్రాల తరలింపు, అభ్యర్థుల రిజిస్ట్రేషన్‌, బయోమెట్రిక్‌ వెరిఫికేషన్‌, అభ్యర్థుల తనిఖీ, బందోబస్తు తదితరవి పకడ్బందీగా ఉండాలన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 71 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసి 4,488 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మూసివేశామని సీఎస్‌ చెప్పారు. ఇప్పటి వరకు 10.58 లక్షల మంది రైతుల ఖాతాలలో రూ.13,577 కోట్లు జమ చేశామని, మిగిలిన ధాన్యాన్ని కూడా త్వరితగతిన కొనుగోలు చేసి ఈ ప్రక్రియ ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రతి మండల మహిళా సమాఖ్యకు ఒకటి చొప్పున 553 బస్సులను మంజూరు చేశామని, ఈ బస్సులను మంగళవారం సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా మహిళా సమాఖ్య సభ్యులకు అందజేయడం జరుగుతుందన్నారు. జూన్‌ 12న పాఠశాలల పునఃప్రారంభానికి విద్యార్థులకు అందజేయాల్సిన యూనిఫామ్‌లతో సిద్ధంగా ఉండాలని తెలిపారు.

కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ స్పందిస్తూ జిల్లాలో వరిధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, వర్షాల దృష్ట్యా కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు అందుబాటులో ఉంచామని, రవాణా సంబంధిత ఏర్పాట్లు చేశామని, తడిసిన ధాన్యాన్ని వెంటనే బాయిల్డ్‌ రైస్‌ మిల్లులకు తరలిస్తున్నామన్నారు. సీఎం సభకు మహిళల తరలింపు కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపడుతామన్నారు. పాఠశాలల పునఃప్రారంభానికి పకడ్బందీ ఏర్పాటు చేస్తామని పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు అందుబాటులో ఉంచేలా చూస్తామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ అమరేందర్‌, డీఆర్‌డీఓ చిన్న ఓబులేషు, డీపీఆర్‌ఓ నర్సింహారావు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement