వయో పరిమితి పెంపుపై భిన్నాభిప్రాయాలు
అనిశ్చితి తొలగించాలి..
జీవితాలతో చెలగాటం..
యూనిఫాం ఉద్యోగాలకు సైతం..
ప్రకటనలు వేయాలి
● జాబ్ క్యాలెండర్
విడుదల చేయాలని డిమాండ్
● ఉద్యోగ ప్రకటనల కోసం
వేలాది మంది ఎదురుచూపు
కర్వెన రిజర్వాయర్‌ను పరిశీలిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు మధుసూదన్‌రెడ్డి, రాజేష్‌రెడ్డి
కందనూలు: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితి 34 నుంచి 44 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో నిరుద్యోగుల్లో కొంత ఆశలు రేకెత్తించినా.. నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయి అనే అంశంలో మాత్రం సందిగ్ధం నెలకొంది. ‘నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయి‘..? అనే ప్రశ్న నిరుద్యోగులను వెంటాడుతోంది. వయోపరిమితి పెంచిన ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్లు ప్రకటిస్తే ఇన్నాళ్లు వేచి చూసిన నిరుద్యోగుల్లో కొంత ఉత్సాహం కలుగుతుంది. తమకు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే తపన కలిగినవారు ఆ దిశగా ప్రయత్నం చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే వయో పరిమితిని ఈ విద్యా సంవత్సరానికి మాత్రం పరిమితం చేయడంతో ఈ ఏడాదిలోనే విడుదల చేసే ఉద్యోగ ప్రకటనలకు మాత్రమే ఈ వయో పరిమితి ఉంటుంది. దీంతోపాటు యూని ఫాం సర్వీస్‌లకు వర్తించదనే నిబంధనతో అనేక మంది నిరుద్యోగులు నిరాశలో పడ్డారు. ప్రభుత్వం విడుదల చేసే ఉద్యోగ నోటిఫికేషన్లలో అత్యధికంగా పోలీస్ జాబ్‌లే ఉండే అవకాశం ఉంది.
పట్టణాల్లో కోచింగ్ తీసుకొని..
వయో పరిమితి పెంపు కొంత ప్రభుత్వానికి సానుకులంగా ఉన్నా.. గత కొన్నేళ్ల నుంచి ఉద్యోగ నోటిఫికేషన్లు రాకపోవడంతో నిరుద్యోగుల్లో నిరాశ అలుముకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు నోటిఫికేషన్లు వేయలేదు. అనేక ప్రభుత్వ శాఖల్లో వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయని, భర్తీ ప్రక్రియ నత్తనడకన సాగుతోందని యువత కొంత అసహనంతో ఉంది. సడలింపులు ఇస్తున్నారు కానీ.. ఉద్యోగ ప్రకటనలు రావడం లేదు. చదువు పూర్తి చేసుకొని ఏళ్ల తరబడి పట్టణాల్లో కోచింగ్ తీసుకొని నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న యువత కుటుంబాలకు భారం ఒకవైపు, నిరుద్యోగం మరోవైపు వెంటాడుతున్నాయని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జాబ్ క్యాలెండర్ ఎక్కడ..
కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో ప్రతి ఏడాది జ్యాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ప్రకటించింది. కానీ, దాదాపు మూడేళ్లు కావొస్తున్న ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ ప్రకటించకపోవడంతో నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ప్రభుత్వం త్వరలో వివిధ శాఖల్లో నియామకాలు చేపడుతామని సంకేతాలు ఇస్తున్నప్పటికీ.. అధికారికంగా ప్రకటనలు రాకపోవడంతో నిరుద్యోగుల్లో అనిశ్చితి కొనసాగుతోంది. వయోపరిమితి సడలింపు సానుకూలం కానీ, వాస్తవ ఉద్యోగ అవకాశాలే యువతకు ప్రధానం అని విద్యాభిమానులు పేర్కొంటున్నారు.
హాస్టళ్లు, అద్దె గదుల్లో సతమతం
హైదరాబాద్‌లో, జిల్లాకేంద్రాల్లో హాస్టళ్లు, గదులు అద్దెకు తీసుకొని ఎలాగైనా ఈసారి ఉద్యోగం సాధించాలనే తపన కలిగి కోచింగ్ తీసుకుంటున్న గ్రామీణ యువత పరిస్థితి దయనీయంగా ఉంది. తల్లిదండ్రులపై ఆర్థిక భారం పెరుగుతుండగా.. ఇటు నోటిఫికేషన్లు రాక, ఉద్యోగ భరోసా కనిపించక ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. డీఎస్సీ ప్రిపరేషన్ చేసేవారు కొందరైతే.. గ్రూప్స్ ప్రిపరేషన్ చేసేవారు మరికొందరు ఇలా ఉద్యోగ ప్రకటనల కోసం నిరుద్యోగుల వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
ప్రభుత్వం వయోపరిమితి పెంచడంతోపాటు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగుల్లో నెలకొన్న అనిశ్చితిని తొలగించాలి. ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఎన్నాళ్లు ఇలా వేచి చూడాలి. ప్రభుత్వానికి నిరుద్యోగుల గురించి పట్టింపులేదు.
– నర్మద, నిరుద్యోగి, తెలకపల్లి
రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీలు చాలా ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటి వరకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వకపోవడం శోచనీయం. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడటం సరైంది కాదు. ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగ ప్రకటనలు విడుదల చేయాలి.
– సృజన, నిరుద్యోగి, తెలకపల్లి
ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి పదేళ్లు వయోపరిమితి పెంపు మంచిదే అయినా.. యూనిఫాం సర్వీసు ఉద్యోగాలకు 2, 3 ఏళ్లపాటు వయోపరిమితి సడలించాలి. ఒక్కసారి మాత్రమే కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇచ్చారు.
– తిరుపతి, నిరుద్యోగి, నాగర్‌కర్నూల్
ప్రభుత్వం ప్రతి ఏడాది ఉద్యోగ ప్రకటనలు వేస్తే.. ఇప్పుడు వయోపరిమితి పెంచాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పటికై నా ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్లు ఇవ్వాలి. ప్రకటనలు ఎప్పుడు ఇస్తారు.. పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారు అనే దానిపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలి.
– సురేష్, నిరుద్యోగి, నాగర్‌కర్నూల్


