కందనూలు: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లా పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా విజయవంతం చేసినట్లు ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌జీ పాటిల్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. జిల్లాలో రెండు రోజుల పర్యటన సందర్భంగా జిల్లా యంత్రాంగం తరపున అన్ని శాఖల సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయగా.. పోలీసు శాఖ ఆధ్వర్యంలో 950 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో బహుళస్థాయి భద్రతా చర్యలు చేపట్టామన్నారు. హెలీప్యాడ్, పంప్‌హౌస్ ప్రాంగణం, వీఐపీ మార్గాలు, పార్కింగ్ ప్రాంతాలు, ప్రజా సమావేశ ప్రదేశాలు తదితర కీలక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి పర్యటనను విజయవంతం చేశామన్నారు. సీఎం పర్యటన విజయవంతం కావడంలో పోలీసు శాఖతోపాటు జిల్లా యంత్రాంగం, ప్రతిఒక్కరూ తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించడం వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కార్యక్రమం పూర్తయిందని చెప్పారు. బందోబస్తు విధుల్లో అత్యంత అంకితభావంతో పనిచేసిన ప్రతి పోలీసు అధికారి, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
జిల్లాలో
మోస్తారు వర్షాలు
కందనూలు: జిల్లాలో శుక్రవారం సాయంత్రం పలుచోట్ల మోస్తారుతోపాటు తేలికపాటి వర్షం కురిసింది. ఊర్కొండ మండలంలో అత్యధికంగా 19 మి.మీ., వెల్దండలో 11 మి.మీ., ఉప్పునుంతల మండలం వెల్టూరులో 9.5 మి.మీ., పదరలో 6.5 మి.మీ., తెలకపల్లి మండలం పెద్దూరులో 5.5 మి.మీ., వర్షపాతం నమోదైంది. ఉదయం నుంచి ఎండ వేడిమికి ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలు సాయంత్రం కురిసిన వర్షంతో వాతావరణం చల్లబడి ఉపశమనం పొందారు.
పర్యావరణంపై అవగాహన పెంచుకోవాలి
కందనూలు: పర్యావరణంపై అవగాహన పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని జిల్లా జడ్జి రమాకాంత్ అన్నారు. శుక్రవారం పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న భూతాపం, ప్లాస్టిక్ వ్యర్థాలు, జీవవైవిధ్య క్షీణత వంటి సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. పోక్సో కోర్టు స్పెషల్ జడ్జి నసీం సుల్తానా, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ శ్రీదేవి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రవికాంత్‌రావు, న్యాయవ్యాదులు తదితరులు పాల్గొన్నారు.


