విత్తనాల కొనుగోలులో అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

విత్తనాల కొనుగోలులో అప్రమత్తంగా ఉండాలి

Jun 4 2026 5:22 AM | Updated on Jun 4 2026 5:22 AM

విత్తనాల కొనుగోలులో అప్రమత్తంగా ఉండాలి

కందనూలు: విత్తనాల కొనుగోలు సమయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి యశ్వంత్‌రావు సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పలు విత్తన దుకాణాల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా విత్తనాలు, ఎరువుల స్టాక్‌తో పాటు పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం డీఏఓ మాట్లాడుతూ.. ముఖ్యంగా పత్తి విత్తనాలను లైసెన్స్‌ కలిగిన డీలర్ల వద్దే కొనుగోలు చేసి రశీదు పొందాలన్నారు. విత్తన బస్తాలపై కంపెనీ పేరు, హైబ్రిడ్‌ రకం, లాట్‌ నంబర్‌, మొలక శాతం, స్వచ్ఛత శాతం, ప్యాకింగ్‌ తేదీ, గడువు తేదీ వంటి వివరాలను రైతులు తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. సీల్‌ చెదరని సంచులను మాత్రమే కొనుగోలు చేయాలని.. ప్రభుత్వ అనుమతిలేని బిజీ 111/ఏఖీఆఖీ వంటి పత్తి విత్తనాలకు దూరంగా ఉండాలని పేర్కొన్నారు. ప్రతి విత్తన సంచిలో కొంత నమూనా విత్తనాన్ని భద్రపరచుకోవాలని.. విత్తే ముందు మొలక పరీక్ష నిర్వహించాలని రైతులకు సూచించారు. విత్తనాల నాణ్యతలో లోపాలు, మొలక సమస్యలు తలెత్తితే వెంటనే వ్యవసాయశాఖ అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలన్నారు. అదే విధంగా నకిలీ, లేబుల్‌ లేని విత్తనాల విక్రయాలు గమనిస్తే సమాచారం అందించాలని తెలిపారు. వర్షం పడి నేల పూర్తిగా తడిసిన అనంతరం, భూమిలో 9 నుంచి 12 అంగుళాల మేర తేమ ఉన్నప్పుడే విత్తనాలు విత్తుకోవాలని ఆయన రైతులకు సూచించారు. ఫర్టిలైజర్‌ దుకాణదారులు విధిగా విత్తన చట్టం–1966 నిబంధనలను పాటించాలని ఆదేశించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement