కల్వకుర్తి రూరల్: జిల్లా అభివృద్ధికి నిధులు కేటాయించడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు ఆరోపించారు. బుధవారం పట్టణంలోని సీపీఎం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాకు అదనపు నిధులు ఎన్ని ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. పెండింగ్ ప్రాజెక్టులను సైతం పూర్తి చేయలేకపోతున్నారని విమర్శించారు. ఇంజినీరింగ్ కాలేజీ, కొత్త పరిశ్రమల స్థాపన కోసం ఎలాంటి చొరవ చూపడం లేదన్నారు. సీఎం సొంత జిల్లా అభివృద్ధికి నిధులు కేటాయించకపోవడం సరికాదన్నారు. జిల్లా రైతాంగానికి పూర్తిస్థాయిలో సాగునీటి సౌకర్యం కల్పించడంతో పాటు గ్రానైట్, కాగితం పరిశ్రమ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు ఆంజనేయులు, ఏపీ మల్లయ్య, బాలస్వామి, భీమరాజు ఉన్నారు.


