● కాంగ్రెస్ వచ్చిన రెండున్నరేళ్లలోనే గుణాత్మక మార్పు
● నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి
సాక్షి, నాగర్‌కర్నూల్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండున్నరేళ్లలో గుణాత్మక మార్పు కనిపిస్తోందని నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు. అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యా లయంలో ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణన ప్రక్రియ దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు. కేంద్రం సైతం దేశవ్యాప్తంగా శాసీ్త్రయ పద్ధతితో కులగణన చేపట్టి.. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు న్యాయబద్ధంగా రిజర్వేషన్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వం నియోజకవర్గానికో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణాన్ని చేపట్టిందన్నారు. తద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీల్లోని పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుందని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద కొత్తగా మరో 2.50 లక్షల ఇళ్లను మంజూరు చేయనున్నట్టు చెప్పారు.
పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పాటు పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పూర్తిపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టిసారించారని మల్లు రవి అన్నారు. ప్రాజెక్ట్ పనుల పర్యవేక్షణకు స్వయంగా ముఖ్యమంత్రి వస్తున్నారని చెప్పారు. రెండు రోజులపాటు ఇక్కడే ఉండి నార్లాపూర్, వట్టెం, కర్వెన పంప్‌హౌస్, రిజర్వాయర్ల పనులను పరిశీలిస్తారని.. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని ఆయన పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, కౌన్సిలర్లు బాదం రమేశ్, నిజాం ఉన్నారు.


